కసబ్‌కంటే ఖతర్నాక్ శత్రువు?

ముంబై నగరంపై ఎప్పుడూ ఉగ్రవాదుల కన్ను ఉంటుంది. అదును దొరికినప్పుడు మారణకాండకు పాల్పడతారు. కసబ్ గ్యాంగ్ ముంబై ముట్టడి సందర్భంగా సాగించిన నరమేధం ఎలా మర్చిపోగలం? ఇప్పుడు అదే ముంబైకి మరో ముప్పు పొంచి ఉంది. అదే డ్రోన్‌‍లు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో నగరంలో డ్రోన్లను నిషేధించాలని ముంబై పోలీసులు నిర్ణయించడం ఓ సంచలనం.

కాలం మారుతోంది. అంతా హైటెక్ మయం అవుతోంది. ఉగ్రవాదం కూడా కొత్త రూపంలో ముంచుకొస్తుంది. ఇకమీదట డ్రోన్ల రూపంలో ఉగ్రదాడులు జరగవచ్చని ఇంతకు ముందే ఢిల్లీ పోలీసులను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ఇప్పుడు ముంబైమీద జులై, ఆగస్టు నెలల్లో డ్రోన్ల ద్వారా దాడులు జరగవచ్చని తాజా సమాచారం. దీనికి బలమైన కారణం ఉంది. ముంబైలో అతి కీలకమైన భాభా ఆటమిక్ రీసెర్చి సెంటర్(బార్క్)కు అతి సమీపంలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్సెస్ కాంప్లెక్స్ లో సోమవారం నాడు డ్రోన్ కనిపించింది. ఇది నిఘా వర్గాల అనుమానం బలపడేలా చేసింది. డ్రోన్ లో కెమెరా అమరిస్తే అంతా రికార్డు చేస్తుంది. అందులో బాంబు పెట్టి పేలిస్తే శత్రువును అంతం చేయవచ్చు.

ఉత్తర పాకిస్తాన్ లో అమెరికా సైన్యం డ్రోన్ దాడులతోనే వేల మంది తాలిబన్ ఉగ్రవాడులను హతమార్చింది. కాకపోతే అవి చాలా పెద్ద సైజు డ్రోన్లు. సైజు ఏదైనా ముప్పు ముప్పే. ముంబైకి డ్రోన్ల దాడి ముప్పు ఉందనే సమాచారంతో తాత్కాలికంగా నగరంలో డ్రోన్లను నిషేధించారు. నిజానికి, ఈ ముప్పు ముంబైకే కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడో కూర్చుని రిమోట్ కంట్రోల్ ద్వారా కోరుకున్న చోట బాంబులు పేల్చవచ్చు. ఎవరూ పట్టుబడే రిస్కు లేకుండా పేలుళ్లు జరపవచ్చు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీపై డ్రోన్లతో దాడులు చేయవచ్చని ఇటీవలే ఐబీ, రా సంస్థలు పోలీసులను హెచ్చరించాయి. డ్రోన్లతో మరో ముప్పు ఏమిటంటే, వీవీఐపీలను, వారి వాహనాలను సరిగ్గా టార్గెట్ చేసి మరీ దాడి చేయడం సులువు. డ్రోన్ కింది భాగంలో కెమెరా అమర్చితే, అది ఏ ప్రాంతంపై ఎగురుతోందో తెలుస్తుంది. ఆ విధంగా అనుకున్న టార్గెట్‌ను అంతం చేయవచ్చు.

ఇటీవల నేపాల్ భూకంప సమయంలో ఓ విదేశీ మీడియా సంస్థ డ్రోన్ ను ఉపయోగించింది. దాని అడుగుభాగంలో ఓ కెమెరాను అమర్చింది. అది ఖాట్మండు నగరంపై విహరిస్తూ భూకంప దృశ్యాలను రికార్డు చేసింది. అప్పట్లో ఆ చానల్ కవరేజీ సంచలనం కలిగించింది. అది మంచి పనికి చేసింది కాబట్టి పరవాలేదు. అదే బాంబులు అమర్చి దాడులకు ప్లాన్ చేసి ఉంటే కచ్చితంగా అందులోనూ సఫలమై ఉండేది. భారత్ ఇప్పుడు డ్రోన్ల దాడులను ఎదుర్కోవడానికి కాదు, అవి జరగకుండా నిరోధించడానికి పూర్తిగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com