గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తరవాత నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబో మళ్లీ సెట్ అయ్యింది. త్వరలోనే వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. ప్రస్తుతం ‘అఖండ 2’ చేస్తున్నారు బాలయ్య. గోపీచంద్ మలినేని సినిమా ఒకటి పట్టాలెక్కాలి. దాంతో పాటు క్రిష్ సినిమానీ మొదలెట్టాలని బాలయ్య భావిస్తున్నారు. క్రిష్ సినిమా కథ విషయంలో పెద్దగా తర్జనభర్జనలు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. బాలయ్య దగ్గర `ఆదిత్య 999` స్క్రిప్టు రెడీగా వుంది. ఈ స్క్రిప్టే ఆయన క్రిష్ చేతుల్లో పెట్టబోతున్నారు. నిజానికి ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. ఆయనకు వయసు పైబడింది. అందుకే ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. నిన్నా మొన్నటి వరకూ ఈ కథని బాలయ్యే స్వయంగా టేకప్ చేద్దామనుకొన్నారు. కానీ బాలయ్య కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ, డైరెక్షన్ కూడా నెత్తిమీద పెట్టుకోవడం చాలా కష్టం. `అన్ స్టాపబుల్`, ఎం.ఎల్.ఏ పదవి.. ఇవి కూడా చూసుకోవాలి. అందుకే… డైరక్షన్ చేయాలని ఉన్నా, ఆ ఆలోచన పక్కన పెట్టారు.
క్రిష్ చాలా ఫాస్ట్. ఆయన వేగంగా సినిమా పూర్తి చేస్తారు. బాలయ్య మైండ్ సెట్ బాగా అర్థం చేసుకొన్న వ్యక్తి. కాబట్టి ‘ఆదిత్య 999’కి ఆయనే కరెక్ట్ అన్నది ఫ్యాన్స్ అభిప్రాయం కూడా. ఓరకంగా క్రిష్‌కు ఇది డబుల్ బొనాంజా. ఎందుకంటే ఈ సినిమాలో మోక్షజ్ఞ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. మోక్షు ఎంట్రీ సినిమా కోసం చాలామంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం కూడా క్రిష్ దక్కించుకొన్నట్టే. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రిష్ ‘ఘాటీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.