హరిహరవీరమల్లు సినిమాకి ఆద్యుడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన చెప్పిన కథ పవన్ కళ్యాణ్ నచ్చడంతో సినిమా సెట్స్‌కి వెళ్ళింది. అయితే సినిమా జాప్యం కావడంతో క్రిష్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారు. ఆయన స్థానంలో జ్యోతికృష్ణ దీన్ని పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన క్రిష్ ఎట్టకేలకు సినిమా గురించి పెదవి విప్పారు. తొలిసారిగా ఆయన స్పందన తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారి వలనే ఇది సాధ్యమైంది. వారు సినిమాల్లోనే కాదు… నిజ జీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తి. నాకెంతో ఉత్సాహాన్నిచ్చిన ప్రాజెక్టులలో ఈ సినిమా ఒకటి. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా.. ఈ సినిమా కథను రూపొందించడంలోనూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అని క్రిష్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రిష్ ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. సినిమాపై ఆయన తొలి స్పందన ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్, ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో క్రిష్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రిష్ గారు మంచి కాన్సెప్ట్‌తో తనను సంప్రదించారని, ఆయన చెప్పిన కథ ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసలు కురిపించారు.