క్రిష్ లో కొత్త యాంగిల్ చూడ‌బోతున్నామా?

ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర‌వాత క్రిష్ సినిమా ఏమిట‌న్న‌ది ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. క్రిష్ కూడా త‌న త‌దుప‌రి సినిమా విష‌యంలో ఎలాంటి తొంద‌రా ప‌డ‌ద‌ల‌చుకోలేదు. కాక‌పోతే ఎలాంటి క‌థ ఎంచుకోవాల‌న్న విష‌యంలో క్రిష్ లో కొంత గంద‌ర‌గోళం ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. క్రిష్ సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లైతే పొంద‌గ‌లిగాయి.కానీ ఆర్థికంగా లాభాల్ని గ‌డించ‌లేక‌పోయాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ అయితే… అవి కూడా ద‌క్క‌లేదు. క్రిష్‌తో సినిమాలు తీసిన ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కూడా బాగా న‌ష్ట‌పోయింది. ఆఖ‌రికి `అంత‌రిక్షం` కూడా ఫ‌స్ట్ ప్రేమ్‌కి హ్యాండిచ్చింది. ఈ సినిమాతో దాదాపు 5 కోట్ల వ‌ర‌కూ న‌ష్ట‌పోయిన‌ట్టు టాక్‌.

ఫ‌స్ట్ ఫ్రేమ్ సంస్థ నిర్మాత రాజీవ్ ఆ మ‌ధ్య కొత్త క‌థ‌లు విన్నారు. ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ప‌ట్టాలెక్కించాల‌ని భావించారు. కొన్ని క‌థ‌లు కూడా ఓకే చేశారు. అయితే.. అంత‌రిక్షం దెబ్బ‌తో ప్రొడ‌క్ష‌న్ ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు క్రిష్‌తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఎలాంటి క‌థ ఎంచుకోవాలన్న విష‌యంలో క్రిష్ ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నాడు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ పేరుంది. దాని కోసం భావాత్మ‌క‌, క‌వితాత్మ‌క క‌థ‌ల్ని ఎంచుకుంటూ వెళ్తే… ఆర్థికంగా ఎలాంటి ప్ర‌యోజ‌నాలూ ఉండ‌డం లేదు. అందుకే తొలిసారి పూర్తి క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో ఓ సినిమా చేద్దామ‌ని క్రిష్ భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ అనుకున్న క‌థ‌ల‌న్నీ ప‌క్క‌న పెట్టి, ఓ కొత్త క‌థ‌ని రాసుకుంటున్నాడ‌ట‌. త‌న‌లోనూ ఓ క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని చాటి చెప్ప‌డానికే క్రిష్ ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. టైటిల్‌, న‌టీన‌టుల ఎంపిక‌.. ఇవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌లోనే సాగ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఫ‌స్ట్ ఫ్రేమ్ కి ఓ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఇవ్వాల‌ని క్రిష్ కృత నిశ్చ‌యంతో ఉన్నాడ‌ని, అందుకే రూటు మార్చ‌క త‌ప్ప‌డం లేదని స‌న్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com