ముందస్తుకీ ‘త్యాగం’ కలర్ ఇస్తున్న కేటీఆర్‌..!

KTR

వ‌చ్చే ఆదివారం హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న‌ట్టుగా నిర్వ‌హిస్తామ‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నాలుగున్న‌రేళ్ల‌లో కేసీఆర్ స‌ర్కారు సాధించిన విజ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు నివేదించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు! భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే ఇలాంటి స‌భ జ‌ర‌గ‌లేద‌న్న‌ట్టుగా ఉంటుంద‌న్నారు. సంక్షేమాన్నీ అభివృద్ధినీ మేళ‌వించి, కేసీఆర్ సార‌థ్య‌లో అద్భుత‌మైన పాల‌న అందిస్తున్నార‌న్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై విలేక‌రులు ప్ర‌శ్న అడిగితే… మీరే రాసి, మీరే అడిగితే ఎలా అన్నారు మంత్రి కేటీఆర్‌! తాము ఒక నిర్ణ‌యం తీసుకున్న‌నాడు ఆ ప్ర‌శ్న అడ‌గండి, జ‌వాబు ఆరోజే చెబుతా అన్నారు. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర వెళ్లి తీర్పు కోరాల‌ని అనుకున్న‌ప్పుడు భ‌యం ఎందుక‌న్నారు. ప్ర‌భుత్వంలో ఉన్న తాము అధికారాన్ని త్య‌జించేందుకు సిద్ధంగా ఉంటే, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారు త‌మ‌కే అవ‌కాశం వ‌స్తుంద‌ని ధైర్య‌ముంటే చెప్పాల‌న్నారు! ముంద‌స్తుకు నిజంగానే వెళ్తే… ప్ర‌తిప‌క్షాల‌కు అంత భ‌యం ఎందుకు అన్నారు కేటీఆర్‌..!

ప్ర‌భుత్వం నుంచి లీకులు ఇచ్చింది వారే క‌దా, పార్టీ వ‌ర్గాల‌కు సంకేతాలు ఇచ్చింది వారే క‌దా! స‌భ‌లూ స‌మావేశాలూ చ‌క్క‌బాట్లూ అన్నీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మౌతున్న ధోర‌ణిలో చేస్తున్న‌దీ వారే. కానీ, మీరే రాసి మీరే అడిగితే ఎలా అని మీడియాని కేటీఆర్ ప్ర‌శ్నిస్తే ఎలా..? ముంద‌స్తుకు వెళ్ల‌డాన్ని కూడా ‘అధికారాన్ని త్యాగం’ చేసి వెళ్తున్నామన్న‌ట్టు కేటీఆర్ చూపించే ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం త్యాగ‌మా… ప్ర‌తిప‌క్షాల‌ది భ‌య‌మా అనేది ఇక్క‌డ చ‌ర్చ కానే కాదు! ‘అవ‌స‌ర‌మా’ అనేదే అస‌లు పాయింట్‌.

మ‌రో ఆర్నెల్ల‌పాటు అధికారంలో కొన‌సాగేందుకు కావాల్సిన సానుకూల ప‌రిస్థితులున్న‌ప్పుడు.. అసెంబ్లీని ర‌ద్దు చేసే దిశ‌గా ఎందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు..? ఒక‌వేళ అసెంబ్లీ ర‌ద్దంటూ చేస్తే… దానిలో ‘త్యాగం’ అనే యాంగిల్ కంటే.. తెరాస రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ప్ర‌తిప‌క్షాల‌కి భ‌య‌మా అని ప్ర‌శ్నిస్తున్న కేటీఆర్… ఐదేళ్ల ముగిసే వ‌ర‌కూ ప్ర‌భుత్వాన్ని న‌డిపి… అప్పుడు ఎన్నిక‌ల్ని ఫేస్ చెయ్య‌డానికి తెరాస‌కు భ‌య‌మా అనే ప్ర‌శ్నకు కూడా స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇంకోటి, ఆర్నెల్ల పాల‌న‌ను వ‌దులుకోవ‌డం త్యాగం కాదు. ఆర్నెల్ల‌పాటు కేంద్రం నుంచి వ‌చ్చే నిధులూ, ఇత‌ర ప‌థ‌కాలు.. ఇలాంటివెన్నో రాష్ట్రం కోల్పోతున్న‌ట్టు అవుతుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com