కేటీఆర్… రేవంత్ రెడ్డిని తిట్టాలనే తన ఈగో కోసం పార్టీకి చేటు చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే.. కానీ తిట్లు మాత్రం అసహజం. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న భాష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యక్తిగత దాడులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ శైలిలో కాకుండా, కేటీఆర్ వాడుతున్న లుచ్చా వంటి పదజాలం, ఆవేశపూరిత వ్యాఖ్యలు పార్టీకి మేలు చేయడం కంటే నష్టమే ఎక్కువగా కలిగిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ, అవి స్థాయి దాటినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది.
ప్రభుత్వంపై పోరాటానికి ఎన్నో అంశాలు
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడటానికి బీఆర్ఎస్ చేతిలో ఎన్నో అంశాలు ఉన్నాయి. గ్యారెంటీల అమలుపై ప్రజల్లో ఉన్న అసహనం, సింగరేణి టెండర్ల వ్యవహారం వంటి సీరియస్ ఇష్యూస్‌ను ఎత్తిచూపడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అయితే, కేటీఆర్ ఈ అంశాల తీవ్రతను చర్చకు తీసుకురావడం కంటే, వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తున్నారనిపిస్తోంది. రేవంత్ రెడ్డి హార్వార్డ్ కోర్సు చేయడంపైనా విజ్ఞత కోల్పోయి విమర్శలు చేయడం, విషయాన్ని పక్కదారి పట్టించేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కేటీఆర్ రేవంత్ రెడ్డిని బూతులు తిడితే తప్ప ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు.
కేసీఆర్ భాష .. అవసరానికి తగ్గట్లుగానే !
గతంలో కేసీఆర్ కూడా ఉద్యమ సమయంలో ఘాటైన మాటలు వాడారు. కానీ ఆయన మాటల్లో ఒక స్పష్టత, ఒక వ్యూహం ఉండేవి. ఆయన వాడిన పదాలు ప్రజల్లో కదలిక తెచ్చాయే తప్ప, అసహ్యం కలిగించలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన భాష ఒక గీత లోపే ఉండేది. కానీ ఇప్పుడు కేటీఆర్ ఆ గీతను దాటుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఉద్దేశించి తీవ్రమైన పదజాలం వాడటం వల్ల, ఆ పదాలే హైలైట్ అవుతున్నాయి తప్ప, ఆయన ప్రశ్నిస్తున్న అసలు సమస్యలు మరుగున పడిపోతున్నాయి. రాజకీయాల్లో ఇలాంటివి ఎప్పుడూ విజయం సాధించవు. నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలగాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బోలెడన్ని అవకాశాలు చేతికందుకూంటే.. బీఆర్ఎస్ నేలపాలు చేసుకుంటోంది. అవసరం లేని ఆవేశంతో బూతులు తిట్టి .. కేటీఆర్ ఆ టాపిక్స్ తీవ్రతను తగ్గిస్తున్నారు.
ప్రతీది ఓట్ల లెక్కలు వేసుకుంటేనే రాజకీయం
రాజకీయాల్లో విజయం సాధించాలంటే కేవలం ఆవేశం సరిపోదు, ఆలోచన కూడా కావాలి. ఎదుటివారిని తిట్టడం ద్వారా వారిని తగ్గించలేరు, పైగా అది వారికి సానుభూతిని కలిగించవచ్చు. కేటీఆర్ తన విమర్శలను ప్రజా సమస్యల వైపు మళ్ళించి, తండ్రి నేర్పిన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో, ఈ తరహా ‘బూతుల రాజకీయం’ కాంగ్రెస్‌కు అస్త్రంగా మారి, బీఆర్ఎస్ ప్రతిష్టను మరింత దిగజార్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తిడుతున్నారని ఆయనను అంత కంటే ఘోరంగా తిడితే.. ఇద్దరికీ తేడా ఉండదు. బహుశా అదే కాన్సెప్ట్ తో రేవంత్ రెచ్చగొడుతున్నారేమో కానీ.. ఆ ట్రాప్ లో పడకుండా.. ప్రజలను బట్టి రాజకీయాలు చేయాల్సింది కేటీఆరే. మరి ఎప్పటికి నేర్చుకుంటారో అనేది హార్డ్ కోర్ బీఆర్ఎస్ క్యాడర్ ఆవేదన.
