కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని. ఆయన బహిరంగంగా చెప్పరు కానీ చేతల్లో ఇది బయట పడుతూనే ఉంటుంది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై చావో, రేవో అన్నట్లుగా పోరాడుతూంటే.. కాంగ్రెస్ అభిమాని ఎలా అవుతారని చాలా మందికి డౌట్ వస్తుంది. కాస్త పరిశీలిస్తే ఆయన కాంగ్రెస్ పై పోరాడటం లేదు..కేవలం రేవంత్ పై పోరాడుతున్నారని అర్థమైపోతుంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పై అభిమానాన్ని దాచుకోలేకపోతున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసుపై రేవంత్ స్పందించలేదని కేటీఆర్కు కోపం
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా, రాహుల్ గాంధీలను ఏ 1, ఏ 2లుగా చేర్చింది. దీనిపై రాజకీయ దుమారం రేగింది. పీసీసీ తరపున ధర్నాలు చేశారు. అయితే ఇప్పటి వరకూ రేవంత్ స్పందించలేదని కేటీఆర్ కు కోపం వచ్చింది. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పెద్ద పోస్టు పెట్టారు. ప్రస్తుతం రేవంత్ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ విషయం ఆయనకు తెలియనిది కాదు. అయినా సరే సోనియా, రాహుల్ లపై బీజేపీ కక్ష సాధిస్తూంటే మాట్లాడలేదని.. ఇదేం పద్దతని ఆయన అడుగుతున్నారు. ఇలా అడుగుతూంటే సోనియా, రాహుల్ పై కేటీఆర్కు ఇంత అభిమానం ఉందా అని కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు వచ్చేస్తూంటాయి.
గాంధీభవన్ లో గాడ్సే అంటూ విమర్శలు
రేవంత్ రెడ్డిని గాడ్సే అంటారు కేటీఆర్. గాంధీభవన్ పవిత్రమైన ప్రదేశమని అక్కడ గాడ్సే వచ్చారన్నట్లుగా ఆయన మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని గౌరవించడం లేదని తప్పులు వెదుకుతారు. ఇంకా చెప్పాలంటే.. సోనియా, రాహుల్, ప్రియాంకలకు రేవంత్ గౌరవం ఇవ్వడంలేదని.. పాపం వారు గాడ్సేను నమ్ముకున్నారని అంటారు. అసలు కాంగ్రెస్ నేతలు.. వారి పార్టీ హైకమాండ్ కు గౌరవం..ప్రాధాన్యం అనేది వారి అంతర్గత విషయం. కేటీఆర్ కు ఎందుకంత కోపం వస్తుంది ?. ఆయన మనసులో కాంగ్రెస్ అభిమానం గూడుకట్టుకుని ఉంది కాబట్టే ఇలాంటి స్పందనలు వస్తూంటాయని అనుకోవచ్చు.
కాంగ్రెస్ శ్రేయోభిలాషిత్వం కేటీఆర్ తగ్గించుకోలేరా ?
రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ మధ్య ఏం జరిగినా అది వారి పార్టీ వ్యవహారం. కేటీఆర్ కు అవసరం లేనిది. గతంలో శశిథరూర్ ను రేవంత్ తిట్టారని చిట్ చాట్ లో పాల్గొన్న ఓ జర్నలిస్టు రికార్డు చేసిన ఫోన్ ఆడియోతో … రచ్చ చేశారు. వారి పార్టీ అంతర్గత వ్యవహారంలో ఆయన చూపిన అత్యుత్సాహం చూసి ఏదో అనుకున్నారు. ఇప్పుడు శశిథరూర్ ఎక్కడున్నారు.. రేవంత్ ఎక్కడున్నారు?. రేవంత్ పై కోపంతో .. ఆయనను కాంగ్రెస్ కు దూరం చేస్తే చాలన్న ఆలోచనతో.. కాంగ్రెస్ పై అభిమానం చూపిస్తూ..రేవంత్ ఏదో కాంగ్రెస్ కు..సోనియాకు, రాహుల్ కు ద్రోహం చేస్తున్నారని నమ్మించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. వారి పార్టీ నేత గురించి వారికి తెలియదా?. కేటీఆర్ చెప్పాలా ?