ఓటర్ల జాబితాల సవరణ అంశంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటున్న ఈసీ తాజాగా బీఆర్ఎస్ బృందాన్ని ఆహ్వానించింది. కేటీఆర్ నేతృత్వంలోని టీం వెళ్లి ఈసీతో సమావేశం అయింది. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదని అందుకే పేపర్ బ్యాలెట్లతోనే ఓటింగ్ నిర్వహించాలని తాము కోరామని కేటీఆర్ ఈసీ ఆఫీసు ముందు చెప్పుకొచ్చారు. తమ ఓటు ఎటుపోతుందో ఓటర్లకు తెలియడం లేదని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. బీహార్లో ఓట్ల తొలగింపు కూడా కరెక్ట్ కాదని తాము చెప్పామన్నారు.
ఈసీ పనితీరుపై కేటీఆర్ ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు కానీ.. ఈవీఎంల గురించి మాట్లాడారంటే..దాని అర్థం ఈసీని అనుమానించడమే. రాహుల్ గాంధీ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఈవీఎంలు, రిగ్గింగులతో ఏ రాష్ట్రంలో ఎవరు గెలవాలి..కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో ఈసీ డిసైడ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. తమ వద్ద అణుబాంబు లాంటి సాక్ష్యాలున్నాయంటున్నారు. అయితే రాహుల్ వాదనకు మద్దతు ఇచ్చేందుకు మాత్రం కేటీఆర్ సిద్ధంగా లేరు. కాంగ్రెస్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా… వారితో కలిసే ఆలోచన మాత్రం చేయడం లేదు.
ఎన్నికల ప్రక్రియపై బీఆర్ఎస్కూ అనుమానాలున్నాయి. ఆ మాటకొస్తే ఓడిపోయిన అన్ని పార్టీలకూ అనుమానాలు వస్తున్నాయి. ఒకప్పుడు ఈవీఎంలు ఎంత పక్కాగా పని చేస్తాయో విశ్లేషించిన జగన్ రెడ్డి కూడా ఇప్పుడు ఈవీఎంలతో వద్దని అంటున్నారు. గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో బ్యాలెట్లతోనే దెబ్బతిన్నా ఆయన అదే వాదనకు కట్టుబడ్డారు. జగన్ కు ఇప్పుడు కేటీఆర్ జత కలిశారు. వీరిద్దరూ ఏమైనా ప్రత్యేకంగా ఉద్యమం చేస్తారో చూడాల్సి ఉంది.