రేవంత్ ట్రాప్‌లో పడొద్దని అందరికీ సలహా ఇచ్చి..తానే అ ట్రాప్‌లో పడిపోయారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో తాము గెలిచిన తర్వాత “పొట్టోడా నీ సంగతి చూస్తా” అంటూ కేటీఆర్ చేస్తున్న బెదిరింపులు , అది ఒక బాధ్యతాయుతమైన నాయకుడి హెచ్చరికలా కాకుండా, గల్లీ ఫైట్‌లో ఓడిపోయిన వాడు వెనక్కి వెళ్తూ “రేపు మా అన్నని తీసుకొస్తా చూడు” అన్నట్టుగా ఉంది. అసలు వచ్చే ఎన్నికల వరకు ఆగడం ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు, వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక చూస్తాం అనడం అంటే, ప్రస్తుతానికి తాము ఏమీ చేయలేమనే నిస్సహాయతను స్వయంగా ఒప్పుకోవడమే కదా అన్నది ఇక్కడ పదునైన లాజిక్.
భాషలో తేడా.. రేవంత్ ఘాటు వర్సెస్ కేటీఆర్ బూతు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడే భాషలో పదును ఉంటుంది, తెలంగాణ యాసలోని ఘాటు ఉంటుంది. ఆయన కేసీఆర్‌ను జాతిపిత అన్న ప్రచారాన్ని ఖండిస్తూ వాడే పదాలు ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బకొట్టేలా ఉంటాయి తప్ప, అవి బూతుల కేటగిరీలోకి రావు. కానీ, కేటీఆర్ మాత్రం నేరుగా బ్రోకర్ నా కొడుకు , పొట్టోడా అంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం చూస్తుంటే, ఆయన సంస్కారం ఎటు పోతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ రఫ్ అండ్ టఫ్ రాజకీయాలు చేస్తుంటే, వాటిని తట్టుకోలేక కేటీఆర్ భాషపై అదుపు కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
సీటు పవర్ మర్చిపోయారా? :
కేటీఆర్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు. ఆయన అనుకుంటే ఇప్పుడు ఏదైనా చేయగలరు, కేసులు పెట్టగలరు, అరెస్టులు చేయగలరు. కానీ కేటీఆర్ మాత్రం మేము మళ్ళీ గెలిచాక చూస్తాం అని కలలు కంటున్నారు. గెలుపు అనేది భవిష్యత్తుకు సంబంధించిన విషయం, కానీ అధికారం అనేది వర్తమానం. పవర్ చేతిలో ఉన్నప్పుడు రేవంత్ వేస్తున్న ఎత్తులకు చిత్తవుతూ, భవిష్యత్తు మీద ఆశలతో బూతులు తిట్టడం కేవలం తన కేడర్‌ను సముదాయించుకోవడానికి చేసే ప్రయత్నంలాగే కనిపిస్తోంది.
ట్రాప్‌లో పడొద్దని చెప్పి పడిపోయారుగా !
ఒకప్పుడు కేటీఆర్ అంటే చాలా క్లాస్‌గా ఉంటారని, ఐటీ మంత్రిగా విదేశీయులతో ఇంగ్లీష్‌లో మాట్లాడే తీరు చూసి మురిసిపోయిన జనం, ఇప్పుడు ఆయన నోటి వెంట వస్తున్న బూతుల ప్రవాహం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరినప్పుడు మనిషికి విచక్షణ కోల్పోవడం సహజమే, కానీ ఒక మాజీ మంత్రిగా, బీఆర్ఎస్ భవిష్యత్‌గా తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని కేటీఆర్ గుర్తించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న రాజకీయ ఉచ్చులో చిక్కుకుని, ఇలా నోరు పారేసుకోవడం వల్ల రేవంత్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు సరికదా, కేటీఆర్ గ్రాఫ్ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. రేవంత్ ట్రాప్‌లో పడొద్దని కేడర్‌కు లేఖ రాసి ఆయనే అందులో పడిపోయారు!
