అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని కేటీఆర్ సున్నితంగా కవితకు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ రేవంత్ పై విమర్శలు చేసిన తర్వాత కవిత అంశంపై స్పందించారు. కేసీఆర్ కు లేఖ రాయడం చిన్న విషయమేనని.. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందన్నారు. అయితే అంతర్గత విషయాలు అంతర్గంగానే మాట్లాడుకుంటే మంచిదన్నారు. పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండవచ్చని సమయం వచ్చనిప్పుడు వారి గురించి బయటకు వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎయిర్ పోర్టులో కవిత పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడినట్లుగా కేటీఆర్ చెప్పినట్లయింది. పార్టీ వ్యవహారాలపై.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, కోవర్టులు అంటూ కవిత మాట్లాడటంపై కేటీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. కవిత లేఖ చిన్న విషయం అని చెప్పేందుకు ప్రయత్నించారు. కవిత పార్టీ కోసమే అలా రాశారని.. మాత్రం చెప్పలేదు. దీంతో కవిత వ్యవహారంలో కేటీఆర్ అసంతృప్తి కూడా బయటపడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ అభిప్రాయం ఏమిటన్నది మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ కు అంతు చిక్కడం లేదు. కవిత విషయంలో అసంతృప్తిగా ఉన్నారా లేకపోతే సానుభూతితో ఉన్నారా అన్నది తెలియడం లేదు. కానీ కవిత మాత్రం.. బీఆర్ఎస్ తో ఇక పని లేదన్నట్లుగా సొంత రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా రాజకీయాలు చేస్తూండటం మాత్రం కేసీఆర్ కూడా నచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.