వానలు ఎక్కువగా వస్తాయంటే ఎక్కడో మారుమూల ప్రజల్లాగా హైదరాబాదులోనూ ప్రజలకు ఆందోళన కలుగుతున్నది. ఎందుకంటే హైదరాబాదులోనూ ఈ వారం రోజుల వర్షానికి ఎదురవుతున్న దురవస్థలు నగర వాసులు గతంలో (2000 సంవత్సరంలో నాలాలు పొంగినప్పుడు మినహా) దాదాపు చూడలేదని చెప్పొచ్చు. పొంగిపొర్లే డ్రైన్లు, గోతులు, ఇళ్లలోకి నీళ్లు, నిలిచిపోయే వాహనాలు.. జీవితమే స్తంభించిపోతున్నది. ఇవన్నీ ఒకరోజులో కలిగిన పరిణామాలు కాకపోయినా ఇప్పుడు చాలా అధ్వాన్నంగా మారుతున్న మాట నిజం. గత రెండేళ్లలోనూ జిహెచ్ఎంసి అలసత్వం, నిధుల కొరత వంటి కారణాలన్నీ వున్నాయి. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కెటిఆర్ ప్రచారం, తర్వాత వంద రోజుల ప్రణాళిక, ట్విట్లర్లు, ఆప్‌లు వగైరాల హడావుడి తర్వాత బాధ్యత ఆయనే ప్రధానంగా తీసుకోక తప్పదు. ఎందుకంటే కీర్తి అపకీర్తి తోబుట్టువుల వంటివే. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత కూడా మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్థనరెడ్డి కన్నా కెటిఆర్ మోత ఎక్కువగా సాగింది. అయితే రోడ్లు ప్రైవేటుకు ఇవ్వాలనీ, డ్రైనేజీ బాగు చేయాలంటే పదకొండు వేలు కావాలని ఆయనే సన్నాయి నొక్కులు నొక్కారు. ఈ సమస్యల పరిష్కారం వెంటనే జరిగేది కాదని కూడా ప్రకటించేశారు. అధికారంలో వున్న వారు అందులోనూ సర్వాధికారులనుకుంటున్న వారు రంగంలోకి దిగి తాత్కాలికంగా తక్షణంగా చేయగలిగింది చేయాలి తప్ప చేతులెత్తేయడం పొరబాటు. కెటిఆర్ తన ప్రకటనలతో ఇప్పట్లో ఇవన్నీ బాగయ్యేవి కావన్న సంకేతాన్ని బలంగా పంపించారు. టిహబ్లు, ఐటి క్యారిడార్ల కృషితో పాటు ఈ దేశంలో జన సామాన్యం జీవితాలను ప్రభావితం చేసే అంశాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. ప్రధానంగానూ వుంటాయి. ఆ కోణంలో చూస్తే కెటిఆర్ తగినంత కేంద్రీకరణ, ప్రాధాన్యతా క్రమం పాటించలేదని చెప్పకతప్పదు. నగరంలోని వివిధ సంస్థలనూ ముఖ్యంగా యువతను రంగంలోకి దింపేందుకు కూడా ఆయన ఎలాటి ప్రయత్నం చేసింది లేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే నేను ఒక ఛానల్లో విశ్వ నగరం అంటున్నాం గాని కుక్కల బెడద కాల్వల సమస్య కూడా పోలేదని అంటే నిజమే అని రెండు స్థాయిల్లోనూ కృషి చేయాలని ఆయన అంగీకరించారు. కాని ఆచరణలో రెండో పార్శ్యంపై శ్రద్ద తగ్గింది. పని విభజన లేదు గనక ఇతరులూ చొరవ చూపలేకపోయారు.కెటిఆర్‌కు సన్నిహితుడుగా వుండే ఒక మిత్రుడే అన్నాడు పాతికేళ్లలో ఇంత దారుణమైన పరిస్తితి చూడలేదని.ఇప్పటికైనా షహజాదాను రంగంలోకి దిగమంటోంది చార్ సౌ షహర్.