కేసీఆర్ అద్భుతమైన పరిపాలన అందించారని సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజలకు ఎక్కడా తక్కువ చేయలేదని కేటీఆర్ అంటున్నారు. అలాంటి అద్భుతమైన పాలన మళ్లీ వస్తుందని కేటీఆర్ తన క్యాడర్ కు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ మాటల్ని బట్టి చూస్తే ఆయన ఇంకా తమ పార్టీ ఓటములకు కారణాలను.. అంతకు మించి.. తమ పద్దతుల్ని కరెక్ట్ చేసుకునేందుకు ఉన్న అవకాశాల్ని ఇంకా ఏ మాత్రం అర్థం చేసుకోలేదని అనుకోవచ్చు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటమికి కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఇంకా బీఆర్ఎస్ గాడిలో పడలేదని కేటీఆర్ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చంటున్నారు.
కేసీఆర్ పాలన బాగోలేదని ఓడించలేదు !
బీఆర్ఎస్ ఓటమికి కారణాల్లో .. పరిపాలన బాగోలేకపోవడం అన్న కారణం ఎప్పుడూ ముందుకు రాలేదు. కేటీఆర్ చెబుతున్నట్లుగా.. పదేళ్ల కాలంలో తెలంగాణ బాగుపడింది. రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు పెరిగాయి. హైదరాబాద్‌ను ప్రయారిటీగా చూసుకుని అభివృద్ధి చేశారు. పరిశ్రమల ఆకర్షణలో పోటాపోటీగా విజయాలు సాధించారు. వీటన్నింటినీ ప్రజలు మర్చిపోలేరు. కానీ రాజకీయాల్లో ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా అంశాలు ప్రజలు తమ ఓటు వేయడానికి కారణం అవుతాయి. అందులో మొదటిది అధికార దుర్వినియోగం.
అవినీతి, అహంకారం, నియంతృత్వ పాలన పోకడల వల్లే ఓటమి
పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండటం.. తెలంగాణ ఉన్నంత వరకు తమకు తిరుగులేదని. ..కేసీఆర్ ఉన్నంత వరకూ ఆయనే సీఎం అనే ఓ రకమైన భ్రమ వల్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో నియంతృత్వం రాజ్యమేలింది. దానికి చిన్న ఉదాహరణ.. ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని వాదించవచ్చు కానీ.. బయటకు వస్తున్న ఫోన్ కాల్ రికార్డింగులే సాక్ష్యాలుగా ప్రజల ముందు కనిపిస్తున్నాయి. తమకు అడ్డం వస్తాడని భావించిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు. చివరికి కుటుంసభ్యులను వదలలేదని రికార్డులు చెబుతున్నాయి. ఇక బీఆర్ఎస్ అగ్రనేతల నుండి.. కింది స్తాయి వరకూ చేరిపోయిన అవినీతిని నియంత్రించలేకపోయారు. అధికారం ఉందనే అహంకారంతో.. అందర్నీ అరెస్టులు చేయించిన వైనం.. ఎవర్నీ లెక్క చేయకుండా కించ పరిచిన వైనం కూడా ప్రజల్ని అసంతృప్తికి గురిచేసింది. నేల విడిచి సాము చేసినట్లుగా తెలంగాణ ను వదిలేసి భారత రాష్ట్ర సమితి అని మార్చుకోవడమూ మైనస్ అయింది. ఇవన్నీ కేటీఆర్ గుర్తించడానికి సిద్ధపడటం లేదు.
అసలు సవాల్‌ను కేటీఆర్ గుర్తించారు – కానీ దారి లేదు !
ముఖాముఖి పోరు ఉన్నప్పుడు ప్రజలు ఓ పార్టీపై వ్యతిరేకతతో మరో పార్టీకి ఓటేస్తారు. ఏపీలో అదే జరుగుతోంది. తెలంగాణలో ఇప్పుడు కొత్త ప్రత్యామ్నాయం బీజేపీ రూపంలో ముందు ఉంది. అన్ని పార్టీలకు మార్చి మార్చి ఆవకాశాలు ఇస్తున్నప్పుడు బీజేపీకి మాత్రం ఎందుకివ్వకూడనది ఈ సారి ప్రజలు అనుకుంటారు . ఆ విషయం కేటీఆర్ కు క్లారిటీ ఉంది. అందుకే విలీన ప్రతిపాదనలు పెట్టుకున్నారు. కానీ బీజేపీ అంగీకరించలేదు. ఇలాంటి సమయంలో.. కేటీఆర్ తన రాజకీయ వ్యూహాల్ని అంతే ఓవర్ డోస్‌గా పెంచుకుంటూ పోవడం వ్యూహాత్మకలోపమే. కానీ కేటీఆర్ కు తెలిసిన రాజకీయం అంతే అన్నట్లుగా బీఆర్ఎస్ నడుస్తోంది. ఇలా అయితే గాడిన పడటం ఎప్పటికైనా కష్టమే అనుకోవచ్చు.