తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి రాజకీయానికి ఎదురు లేకుండా పోతోంది. ఆయన పన్నే వ్యుహాల ముందు అంతా తేలిపోతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా చెప్పుకునే కేటీఆర్ అసలు రేవంత్ రాజకీయానికి దరిదాపుల్లోకి రాలేకపోతున్నారు. రేవంత్ పై తిట్లందుకోవడం.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేయించడమే రాజకీయమని ఆయన అనుకుంటున్నారు. కానీ రేవంత్ ఎలా దెబ్బకొట్టాలో అలా దెబ్బకొడుతున్నారు. ఆ దెబ్బల్ని బీఆర్ఎస్, కేటీఆర్ కాచుకోలేకపోతున్నారు. అసహనంతో మరిన్ని తిట్లు తిడుతున్నారు కానీ.. తమకు జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం చేసుకోలేకపోతున్నారు.
బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలపై చావు దెబ్బ
రేవంత్ రెడ్డికి అలా కలసి వచ్చిందో.. లేకపోతే ఆయనే అలా ప్లాన్ చేశారో కానీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ఇండీ కూటమి ఖరారు చేయడం బీఆర్ఎస్కు పెద్ద సమస్యగా మారింది. రేవంత్ ఒకే సారి ప్రెస్ మీట్ పెట్టి … తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డికి అన్ని తెలుగు పార్టీలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. కావాలంటే కేసీఆర్‌ను కలుస్తానని ప్రకటించారు. కేటీఆర్ రాజకీయ అవగాహనా లోపం ఎంత ఉంటుందో.. ఆయన ఎలా స్పందిస్తారో రేవంత్ కు తెలుసుకాబట్టి సుదర్శన్ రెడ్డి అంశాన్ని తెలంగాణకు ఎంత ముడిపెట్టాలో అంతే ముడిపెట్టారు. రేవంత్ అంచనాల్ని కేటీఆర్ ఏ మాత్రం తగ్గించలేదు. అలాగే స్పందించారు.
తెలంగాణ బిడ్డకు మద్దతివ్వని తెలంగాణ వాదానికి ఏం బలం ?
సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ. బిడ్డకు మద్దతివ్వలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన పని లేదు. నిజానికి.. బీఆర్ఎస్ కు ఉన్న ఓటు బ్యాంక్ కేవలం .. తెలంగాణ మద్దతుదారులే. కులాల సపోర్టు లేదు..మతాల సపోర్టు లేదు. కేసీఆర్ తెలంగాణ అంశంపై పార్టీ నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఫలితాలు అనుభించారు. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ తగ్గిపోతూ వస్తోంది. బీఆర్ఎస్ అంతో ఇంతో ఇంకా నిలబడి ఉందంటే దానికి కారణంగా తెలంగాణ వాదుల సపోర్టే. ఇప్పుడు తెలంగాణ బిడ్డకు బీఆర్ఎస్ మద్దతివ్వకపోతే ఆ తెలంగాణ వాదులు మాత్రం బీఆర్ఎస్ వైపు ఎందుకుంటారు?. ఇది బీఆర్ఎస్ పునాదుల్ని మరింత బలహీనం చేస్తుంది. ఇది స్ట్రాటజిక్ గా రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బ.
నాలుగు ఓట్లతో బీఆర్ఎస్కు ఎక్కడా లేనంత కష్టం
బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభలో ఎంపీలు లేరు. రాజ్యసభలో ఉన్నారు. నలుగురు మాత్రమే ఉన్నారు. నాలుగు ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నాలుగు ఓట్లు అటు ఎన్డీఏకు కానీ.. ఇటు ఇండీ కూటమికి కానీ ఏ మాత్రం ఉపయోగపడవు. కానీ అవి బీఆర్ఎస్ నేతల సైద్ధాంతిక మోసాలను ప్రజల ముందు పెట్టేందుకు కాంగ్రెస్ కు బాగా ఉపయోగపడుతున్నాయి. కేటీఆర్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, యూరియా ఇచ్చిన వాళ్లకే ఓట్లేస్తామని చేసిన ప్రకటన.. ఇప్పటికే ఆయన పరిణితి చెందని రాజకీయాన్ని బయట పెట్టింది. ఇదే రేవంత్‌కు కావాల్సింది. ఇలా సులువుగా బీఆర్ఎస్ను ఎక్స్పోజ్ చేసేస్తున్నారు. ఆ పార్టీ భావజాల పునాదుల్ని కదిలించేస్తున్నారు. దీన్ని కేటీఆర్ అర్థం చేసుకోలేకపోతున్నారు.