భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లిహిల్స్ లో గెలుపు ఏకపక్షమని నమ్ముతున్నారు. పార్టీ నేతలతో సమావేశాల్లో ఇదే చెబుతున్నారు. ఆయన ఎందుకు నమ్ముతున్నారో కూడా చెబుతున్నారు. మూడు సర్వేల్లో జూబ్లిహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని వచ్చిందని.. ఈ సర్వేలు పీసీసీ చీఫ్ దగ్గర కూడా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు . పీసీసీ చీఫ్ దగ్గర ఉన్నాయో లేవో కానీ.. కేటీఆర్ ఈ సర్వేల మీద ఎలా నమ్మకం పెట్టుకుంటున్నారన్న అనుమానం పార్టీ నేతలకు వస్తుంది.
బీఆర్ఎస్ సోషల్ మీడియాలో భాగం అయిన కొన్ని చానళ్లు ఇటీవలి కాలంలో రోజూ ఓ సర్వేను వదులుతున్నాయి. చివరికి ప్రసాద్ అనే వైసీపీ ఎనలిస్టును కూడా తీసుకు వచ్చి సర్వే చేయించారు. ఆయన చెప్పిన మాటలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ఎనలిస్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తుదని చెప్పాడు. అలాగే వైసీపీ గెలుస్తుందని చెప్పాడు. జనాలను పిచ్చోళ్లను చేయడానికి.. ఎక్కడో సర్వే చేశామని నమ్మించడానికి 36.7 .. అంటూ లెక్కలు చెప్పడం ఆయన స్టైల్. చివరికి ఆయన సర్వేనూ కేటీఆర్ నమ్ముకున్నారేమో కానీ.. ఇవన్నీ ప్రజల్లో పాజిటివ్ వేవ్ తెచ్చేవి కాదని.. ఇంకా మైనస్ అవుతాయని అంటున్నారు.
ఉపఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ.. తమ హవా తగ్గిన తర్వాత ఉపఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ లోనే ఓడిపోయింది. మిగిలిన ఉపఎన్నికల్లో తిరుగులేని మెజార్టీలు సాధించారు. ఎమ్మెల్యేలు చనిపోయిన నియోజకవర్గాల్లోనూ అంతే. ఇటీవల తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చిన కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. కానీ జూబ్లిహిల్స్ పై మాత్రం కేటీఆర్ గెలుస్తామని ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు.