Kuberaa Movie Review
తెలుగు360 రేటింగ్:3.25/5
కొంతమంది దర్శకుల్ని గుడ్డిగా నమ్మేయొచ్చు. థియేటర్లకు గుండె నిబ్బరంతో వెళ్లొచ్చు. వస్తూ వస్తూ… థియేటర్ నుంచి ఏదైనా పట్టుకు రావొచ్చు. కొన్ని మనసులో దాచుకోవొచ్చు. ఆ తరవాత పదిమందితో పంచుకోవొచ్చు. అలాంటి దర్శకుడు శేఖర్ కమ్ముల. పాతికేళ్ల ప్రయాణంలో పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు. కానీ తనదైన మార్క్ సృష్టించుకొన్నాడంటే దానికి కారణం.. ఆ నమ్మకమే. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరవాత ‘కుబేర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శేఖర్ కమ్ముల. ఇందులో నాగార్జున, ధనుష్‌లాంటి స్టార్లు ఉండొచ్చు గాక. కానీ మార్క్ మాత్రం శేఖర్ కమ్ములదే. అతనిపై నమ్మకంతోనే కళ్లన్నీ ఈ సినిమా వైపు తిరిగాయి. మరి ‘కుబేర’ ఎలా ఉన్నాడు? నాగ్, ధనుష్‌లాంటి స్టార్లు శేఖర్ కమ్ములలోని కథకుడికి ఎంత వరకూ సాయం చేశారు?
కథ సింపుల్‌గా, అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే… ఆయిల్ స్కామ్‌లో లక్ష కోట్లు చేతులు మార్చాల్సివస్తుంది. ఆ డబ్బు బినామీ పేర్ల మీద మంత్రులు, అధికారులకు బదిలీ కావాలి. ఆ బినామీలుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకొంటారు. అందులో ఒకడు దేవా (ధనుష్). ఈ నలుగురిలో ఒక్కరికీ అక్షర జ్ఞానం కూడా ఉండదు. తమ వెనుక ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇదంతా ఓ మాజీ సీబీబీ అధికారి దీపక్ (నాగార్జున) ఆధ్వర్వంలో నడుస్తుంది. దీపక్ మంచోడే. కానీ కార్పొరేట్ వ్యవస్థ చేతిలో తాను కూడా ఓ కీలుబొమ్మగా మారిపోతాడు. మరి ఈ స్కామ్ లో లక్ష కోట్లు చేతులు మారాయా, లేదా? మధ్యలో వచ్చిన ఆటంకాలేంటి? తిరుపతిలో బిచ్చగాడిలా బతుకీడిస్తున్న దేవా – ఈ గేమ్‌లో ఎలా ఇరుక్కోవాల్సివచ్చింది? అందులోంచి బయటపడ్డాడా, లేదా? అనేది మిగిలిన కథ.
శేఖర్ కమ్ముల కథలన్నీ ఒకే తరహాలో సాగేవి. కాలేజీ స్టోరీలు, ప్రేమ కథలు, ఎమోషనల్ డ్రామా.. ఇదీ శేఖర్ ముడి సరుకు. కానీ అందులోంచి పూర్తిగా బయటకు వచ్చి చేసిన సినిమా ‘కుబేర’. అవినీతి సొమ్ము ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయి? అనే విషయాల్ని శేఖర్ కమ్ముల లోతుగా అధ్యయం చేసి రాసిన స్క్రిప్టులా అనిపిస్తుంది. ఫస్ట్ సీన్ నుంచే శేఖర్ పాయింట్ లోకి వెళ్లిపోయాడు. ఆయిల్ స్కామ్ మొదలైన తీరు, అందులో ఓ మాజీ సీబీఐ ఆఫీసర్ (నాగార్జున)ని లాక్కురావడం, తాను రాగానే బినామీల ప్లానింగ్.. ఇవన్నీ చక చక సాగిపోతాయి. సినిమా మొదలైన అరగంట వరకూ ధనుష్ తెరపై కనిపించడు. అయినా సరే – మనం కథలోనే ఉంటాం. కథతోనే ఉంటాం. బిచ్చగాళ్ల జీవితంలోని వెతల్ని తెరపై ఆర్థ్రతతో చెప్పాడు దర్శకుడు. చస్తే కట్టెలు కూడా దొరకని అనామక బతుకులుగా చూపించాడు. చావు – అంత్యక్రియల చుట్టూ నడిపిన ఎపిసోడ్ తప్పకుండా ఆకట్టుకొంటుంది. ఆ క్రమంలో వచ్చే ‘పోయిరా మామా’ పాట కూడా ఎమోషన్ పండిస్తుంది.
నలుగురు బిచ్చగాళ్లూ, వాళ్ల బతుకులు, సడన్‌గా వాళ్ల తారుమారైన జీవితాలు, అందలోనే ఆనందం, అంతలోనే విషాదం.. వాటి చుట్టూ నడిపిన సన్నివేశాలు మనసును హత్తుకొంటాయి. ఈ కార్పొరేట్ మాయలో తాను బలిపశువు అయ్యానన్న సంగతి దీపక్ కి తెలియడం, దేవా తప్పించుకొని పారిపోవడం దగ్గర్నుంచి కథ మరింత రసవత్తరంగా మారిపోతుంది. రష్మిక పాత్ర కూడా రెగ్యులర్ హీరోయిన్ గా ట్రీట్ చేయలేదు. తన ఎంట్రీ కూడా ఇంట్రవెల్‌కి ముందే. క్రమంగా ఆ పాత్రని కథలోకి లొక్కొచ్చిన విధానం కూడా ఆకట్టుకొంటుంది. అన్ని పాత్రలూ ఇలా ఆర్గానిక్ గానే విశ్వరూపం దాలుస్తుంటాయి. దీపక్ పాత్రని ముగించిన విధానం కూడా సంతృప్తికరంగా ఉంటుంది.
శేఖర్ కమ్ముల దగ్గర సమస్య ఏమిటంటే.. ప్రతీ సన్నివేశాన్ని విడమరచి చెప్పాలనుకోవడం. దాంతో సీన్ లెంగ్త్ పెరుగుతుంది. సినిమా రన్ టైమ్ పై అది ప్రభావం చూపిస్తుంది. మూడు గంటల పదిహేను నిమిషాల సినిమా ఇది. కనీసం 30 నిమిషాల కోత విధించొచ్చు. అప్పటికీ ఓ పాటని (పిప్పిప్పి) కత్తిరించాడు దర్శకుడు. ఇంకా ట్రిమ్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. కాకపోతే తెరపై నాగ్, ధనుష్ లాంటి నటులు, వాళ్ల ప్రతిభ వల్ల లెంగ్త్ ని కూడా భరించొచ్చు. పాటలకు స్కోప్ తక్కువ. అమ్మ పాట బాగుంది. కానీ రాంగ్ టైమింగ్ అనిపిస్తుంది. ‘నాదే నాదే’ పాటని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా బాగా వాడుకొన్నారు. అండర్ కరెంట్ గా శేఖర్ కమ్ముల రాజకీయ వ్యవస్థని, అవినీతిని చూపించుకొంటూ వెళ్లాడు. కొన్ని డైలాగుల్ని పైపైన చూడకుండా లోలోతుగా అర్థం చేసుకొంటే – శేఖర్ కమ్ముల భావాలు మరింత స్ట్రాంగ్ గా అర్థం అవుతాయి. ముఖ్యంగా `వెంకటేశ్వర స్వామికి వజ్రపు హారం చేయిస్తా` అనే డైలాగ్.
క్లైమాక్స్ లో లక్షల కోట్ల అధిపతిని కాస్త బిచ్చగాడిగా మార్చడం సినిమాటిక్ గా అనిపిస్తుంది. ఓ అనుభవజ్ఞుడైన సీబీఐ ఆఫీసర్, వ్యవస్థనే తన చేతుల్లో పెట్టుకొన్న ఓ అపర కుబేరుడు.. ఓ బిచ్చగాడ్ని పట్టుకోలేకపోవడం కూడా లిబర్టీనే. కొన్ని చోట్ల శేఖర్ రైటింగ్ కాస్త వీక్ గా అనిపిస్తుంది. కానీ తన అదృష్టం ఏమిటంటే.. అలాంటి చోట్ల నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల వర్క్ ఆయా సన్నివేశాల్ని నిలబెట్టేశాయి.
ధనుష్ కెరీర్లో ఇది మర్చిపోలేని పాత్ర. ‘నువ్వు ఈ క్షణం నుంచి బిచ్చగాడివి’ అని శేఖర్ చెబితే – ఆ క్షణం నుంచే తాను బిచ్చగాడిలా మారిపోయాడు. ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్‌లోనూ ఆ క్యారెక్టరైజేషన్ నుంచి ధనుష్ బయటకు రాలేదు. దేవా పాత్రకు ఓ చేయి విరిగి ఉంటుంది. దాన్ని సినిమా అంతా ఫాలో అయ్యాడు. ఒక్క చోట కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూ చేయడం మామూలు విషయం కాదు. అసలు ఇలాంటి పాత్రని ఓ హీరో ఒప్పుకోవడం సాహసం. ఆ సాహసానికి ధనుష్‌కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తప్పులేదు. సీనియర్ హీరోలు తమ ఇమేజ్ చట్రం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. దాన్ని నాగార్జున గుర్తించాడు. ఇది వరకు చూసిన నాగ్ వేరు.. ఈ సినిమాలో నాగ్ వేరు. దీపక్ పాత్రలో చాలా స్ట్రగుల్ ఉంది. ఆ స్ట్రగుల్ నాగ్ కళ్లల్లో, మాటల్లో చూపించగలిగాడు. తనకు గౌరవాన్ని తీసుకొచ్చే పాత్ర ఇది. రష్మిక పాత్ర కూడా క్రమ క్రమంగా కథలోకి చొచ్చుకుపోయింది. తన క్యారెక్టరైజేషన్ తొలి సన్నివేశాల్లో ఫన్నీగా ఉంటుంది. కానీ రాను రాను… బలపడుతూపోయింది. రెగ్యులర్ లవ్ ట్రాక్ అనేది పెట్టకపోవడం శేఖర్ కమ్ముల చేసిన గొప్ప పని. విలన్ గా కనిపించిన జిమ్ తెలుగు ప్రేక్షకులకు కొత్త. అదే కొత్తగా అనిపించింది. తన లుక్ స్టైలీష్‌గా ఉంది. తన విలనిజం సహజంగా అనిపించింది.
దేవిశ్రీ నేపథ్య సంగీతం గురించి తప్పకుండా చెప్పుకోవాలి. కథనంతో పాటు తన సంగీతం కూడా పరుగులు పెట్టింది. ‘పోయిరా మామా’ పాటలో దేవి మార్క్ కనిపిస్తుంది. అమ్మ పాట తప్పకుండా నచ్చుతుంది. ఎడిటర్ ఇంకాస్త నిర్దాక్షణ్యంగా వ్యవహరించాల్సింది. శేఖర్ కమ్ముల తన స్కూల్ నుంచి బయటకు వచ్చాడు. ఓ కొత్త కథని, బలమైన క్యారెక్టరైజేషన్లతో చూపించగలిగాడు. రెగ్యులర్ కథలకు, కమర్షియల్ వాల్యూస్‌కి తానెంత భిన్నమో మరోసారి చూపించాడు. తప్పకుండా శేఖర్ కమ్మల సినిమాల జాబితాలో `కుబేర`కు మంచి స్థానం ఏర్పడుతుంది. కమర్షియల్ గా ఇలాంటి సినిమాలు ఆడితే – భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రయత్నాలు చూసే అవకాశం దక్కుతుంది.
– అన్వర్
తెలుగు360 రేటింగ్:3.25/5