కేవీపీ రామచంద్రరావు విదేశాలకు వెళ్లలేకపోతున్నారు. ఎక్కడ బయటకు వెళ్తి పట్టుకుని అమెరికా జైల్లో వేస్తారోనని గత పన్నెండేళ్లుగా ఆయన దేశం వదిలి పోవడం లేదు. దానికి కారణం రెడ్ కార్నర్ నోటీసు. ఆయనపై అమెరికా కోర్టు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఆ రెడ్ కార్నర్ నోటీసులు తొలగించాలని దాఖలైనా పిటిషన్ పై విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అంతర్జాతీయస్థాయిలో లంచాల నెట్ వర్క్
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని టైటానియం ఖనిజ వనరులను విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు భారీ కుట్ర జరిగిందని అమెరికాలోని నార్త్ ఇల్లినాయిస్ జిల్లా కోర్టులో ఎఫ్‌బీఐ కేసు నమోదు చేసింది. అప్పట్లోనే దాదాపు 18.5 మిలియన్ డాలర్ల లంచాల లావాదేవీలు జరిగినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసులో అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావును ఆరో నిందితుడిగా పేర్కొంటూ, విదేశీ బ్యాంక్ ఖాతాల ద్వారా ఆయన లంచాలు స్వీకరించినట్లు ఎఫ్‌బీఐ అభియోగపత్రంలో వివరించింది.
రెడ్ కార్నర్ నోటీసు – స్టే వ్యవహారం
ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2013లో అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, దాని ఆధారంగా 2014 ఏప్రిల్‌లో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అయితే, కేవీపీ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించి ఈ నోటీసుపై స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుండి ఈ స్టే కొనసాగుతూ వస్తోంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో ఈ రెడ్ కార్నర్ నోటీసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ తన గట్టి వాదనను వినిపించింది. హైకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో రెడ్ కార్నర్ నోటీసును తాము జారీ చేయలేదని, అది పారిస్‌లోని ఇంటర్‌పోల్ హెడ్‌క్వార్టర్స్ నుండి జారీ అయిందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఇక్కడి కోర్టుల్లో పిటిషన్లు చెల్లవని, కేవీపీ తనపై ఉన్న ఆరోపణలను అమెరికాలోని నార్త్ ఇల్లినాయిస్ కోర్టులోనే తేల్చుకోవాలని సీబీఐ తేల్చి చెప్పింది. తాము కేవలం ఇంటర్‌పోల్ నోటీసును అమలు చేసే ఏజెన్సీ మాత్రమేనని, అసలు కేసు అమెరికా పరిధిలోనిదని వివరించింది.
కొనసాగుతున్న ఉత్కంఠ
ప్రస్తుతం ఆ రెడ్ కార్నర్ నోటీసు ఇంకా అమలులో ఉందా లేదా అన్న వివరాలను సేకరించాలని హైకోర్టు సీబీఐని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అంతర్జాతీయ నేరాలకు సంబంధించి వారు దొరికితే..లేదా కేసు మూసివేస్తే తప్ప రెడ్ కార్నర్ నోటీసులు తొలగించరు. ఇప్పుడు కోర్టు ఆ రెడ్ కార్నర్ నోటీసుపై స్టే తొలగితే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేవీపీని అమెరికాకు అప్పగించే ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ కేసు ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
