అపార్టుమెంట్ కొంటే చాలా మంది కార్ పార్కింగుల గురించి ఆలోచిస్తారు కానీ.. తమకు ఎంత ల్యాండ్ షేర్ వస్తుందో ఆలోచించరు ప్రస్తుత రోజుల్లో హై రైజ్ అపార్టుమెంట్లను ఎకరాల స్థలాల్లో నిర్మిస్తున్నారు. ఇలాంటి చోట్ల కూడా వారికి ల్యాండ్ షేర్ వస్తుంది. దీన్ని “అన్ డివైడెడ్ షేర్” (UDS) అంటారు. అపార్ట్మెంట్ ఓనర్షిప్ యాక్ట్ కింద ఫ్లాట్ యజమానులకు భూమిపై హక్కులు వస్తాయి.
అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఉపయోగించిన మొత్తం భూమిలో ఒక్కో ఫ్లాట్ యజమానికి చట్టపరమైన వాటా. ఈ భూమి భౌతికంగా పంపకపోయినప్పటికీ, ఫ్లాట్ పరిమాణాన్ని బట్టి ప్రతి యజమానికి శాతం లేదా చదరపు అడుగుల్లో వాటా కేటాయిస్తారు. ఉదాహరణకు, మొత్తం భూమి 10,000 చదరపు అడుగులు అయితే, మీ ఫ్లాట్ వాటా 2% అయితే మీకు 200 చదరపు అడుగుల UDS ఉంటుంది. ఇది ఫ్లాట్ యజమానికి భూమిపై శాశ్వత హక్కును ఇస్తుంది.
అపార్ట్మెంట్ పాతబడి శిథిలమైతే, రీ-డెవలప్ చేసేటప్పుడు UDS ఆధారంగా కొత్త ఫ్లాట్లు కేటాయిస్తారు. ఇది యజమానుల హక్కులను రక్షిస్తుంది. UDS ఎక్కువ ఉంటే ఫ్లాట్ విలువ పెరుగుతుంది, ఎందుకంటే భూమి విలువ నగర అభివృద్ధితో పెరుగుతుంది. ఇది ఫ్లాట్ యజమానికి భూమిపై యజమానిత్వాన్ని నిర్ధారిస్తుంది, ఇది లోన్ తీసుకోవడానికి లేదా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. UDS సాధారణంగా సూపర్ బిల్ట్-అప్ ఏరియా ఆధారంగా లెక్కిస్తారు.
ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు UDSపై శ్రద్ధ పెట్టకపోతే చట్టపరమైన సమస్యలు రావచ్చు. సేల్ డీడ్‌లో UDS వివరాలు స్పష్టంగా గజాల్లో ఉండేలా చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఇది రికార్డు అవ్వాలి. UDS ఫార్ములా ప్రకారం సరిగ్గా లెక్కించబడిందో చెక్ చేయండి. బిల్డర్ మోసం చేయకుండా లాయర్ సహాయం తీసుకోవచ్చు.