తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే ఆఖరి రోజు. సాధారణంగా ఇలాంటి కీలక ఎన్నికల సమయంలో పట్టణాలన్నీ రాజకీయ జెండాలు, మైకులు, నేతల అనుచరుల సందడితో హోరెత్తిపోవాలి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఆ స్థాయి ఎన్నికల ఫ్లేవర్ కనిపించడం లేదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు స్థానిక ఎన్నికల కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం ఈ నిశ్శబ్దానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ట్యాపింగ్ వేడి.. మేడారం భక్తి
ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ అంతా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు , ఆయన ఇచ్చిన సమాధానం, మేడారం జాతర చుట్టూనే తిరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ట్యాపింగ్ కేసును ఎదుర్కోవడంలో బిజీగా ఉండగా, సామాన్య ప్రజలు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం వైపు వెళ్తున్నారు. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగానే ఇతర అంశాలు చర్చకు రాకుండా, అత్యంత నిశ్శబ్దంగా ఎన్నికల ప్రక్రియను ముగించేలా పావులు కదుపుతోంది.
ఇలాంటి ఎన్నికలు రాజకీయ పార్టీలకూ అయిష్టమే
ఎన్నికల సందడి లేకపోవడం సాధారణంగా అధికార పార్టీకే లాభిస్తుందని ఒక అంచనా. చర్చ తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకృతం కాకుండా, కేవలం స్థానిక సమీకరణాల ఆధారంగా ఎన్నికలు ముగిసిపోతాయి. అయితే, రాజకీయాల్లో ఉత్సాహం లేకపోవడం అధికార పార్టీ శ్రేణుల్లో కూడా అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రచారం హోరెత్తినప్పుడు వచ్చే మైలేజీ, తమ బలాన్ని చాటుకునే అవకాశం ఈసారి నాయకులకు దక్కడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నప్పటికీ, నామినేషన్ల వరకు మాత్రం పరిస్థితి చాలా చప్పగా సాగింది.
స్థానిక నేతలకే భారమంతా!
అగ్రనేతలు కేసుల చుట్టూ తిరుగుతుండటంతో, అభ్యర్థుల ఎంపిక నుండి నామినేషన్ల దాఖలు వరకు మొత్తం భారమంతా స్థానిక నేతలపైనే పడింది. బీఆర్ఎస్ స్థానిక నేతలే అన్నీ చూసుకుంటారు. కాంగ్రెస్ కాస్త ముందుగానే సిద్దమయింది. అయినా స్థానిక నేతలతే భారం. ఒక రకంగా ఈ ఎన్నికలు లీడర్ల కంటే క్యాడర్ మధ్యే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించడంలో సక్సెస్ అయిందని, దీనివల్ల అసలైన అభివృద్ధి ,స్థానిక సమస్యలపై చర్చ జరగకుండానే ఓటింగ్ జరిగిపోనుది.
