అవినీతిని క‌క్కించ‌డానికి రెడీగా ఉన్నా‌మన్న ల‌క్ష్మ‌ణ్

గ‌తంలో ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వంతో అనుస‌రించిన వైఖ‌రినే… ఇప్పుడు తెలంగాణ‌లో తెరాస విష‌యంలో అనుస‌రించ‌బోతోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ! ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కి వ‌చ్చాక‌… చంద్ర‌బాబు నాయుడు పాల‌న అంతా అవినీతిమ‌య‌మైంద‌నీ, అన్నింటా క‌మిష‌న్లూ దోపిలే అంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్పుడు కేసీఆర్ పాల‌న‌పై కూడా ఇదే స్థాయిలో అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు రాష్ట్ర భాజ‌పా అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్.

తెలంగాణ అంటే అవినీతి, అప్పుల రాష్ట్ర‌మ‌ని ప్ర‌జ‌లే అంటున్నార‌ని ల‌క్ష్మణ్ విమ‌ర్శించారు. హైజీనిక్ పేడ్లు ద‌గ్గ‌ర్నుంచీ కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ర‌కూ అన్నింటా అవినీతి రాజ్య‌మేలుతోంద‌న్నారు. కోర్టులు, కాగ్ లాంటి సంస్థ‌లే అవినీతి జ‌రిగింద‌ని తేల్చాయ‌న్నారు. పెళ్లై పిల్ల‌లు పుట్టినా కూడా షాదీ ముబార‌క్, క‌ల్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కాల డ‌బ్బులు చెల్లించ‌డం లేని ప‌రిస్థితి వాస్త‌వ‌మా కాదా అని ప్ర‌శ్నించారు. ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ చెల్లించ‌డం లేద‌నీ, అంగ‌న్ వాడీల‌కు గుడ్లూ పాలు నిధుల్లో కోత‌ల పెట్టార‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌ను రూ. 30 వేల కోట్ల నుంచి ఒకేసారి రూ. 80 వేల కోట్ల‌కు ఎందుకు పెంచార‌న్నారు. కాళేశ్వ‌రంలో అవినీతి లేక‌పోతే, డీపీఆర్ లేకుండా టెండ‌ర్ల‌కు ఎందుకు వెళ్లార‌న్నారు. ఇప్ప‌టికే కొన్ని వేల కోట్లు ఖ‌ర్చు పెట్టార‌నీ, కానీ ఒక్క‌టంటే ఒక్క ఎక‌రాకైనా నీరు వ‌చ్చిందా అని ల‌క్ష్మ‌ణ్ నిల‌దీశారు. కాంట్రాక్టర్ల జేబులు నింప‌డ‌మూ, క‌మిష‌న్లు పెద్ద మొత్తంలో లాక్కోవ‌డం మాత్ర‌మే ఇక్క‌డ జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ధ‌నిక రాష్ట్ర‌మ‌ని చెప్పుకుంటూ ఉంటార‌నీ, అలాంట‌ప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు, బిల్లులు చెల్లించ‌లేని ప‌రిస్థితి ఎందుకొస్తోంద‌న్నారు. తెరాస కేవ‌లం కుటుంబ పార్టీ మాత్ర‌మేన‌నీ, కేసీఆర్ ఆయ‌న త‌రువాత కేటీఆర్ మాత్ర‌మే పార్టీ అధ్య‌క్షుడు అవుతార‌నీ, మూడో వ్య‌క్తికి అవ‌కాశం ఇవ్వ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వం చేస్తున్న ఖ‌ర్చుల‌న్నింటికీ ప్ర‌జ‌ల‌కు లెక్క‌లు చెప్పాల‌న్నారు. ఇక‌పై వీట‌న్నింటి మీదా త‌మ ఫోక‌స్ ఉంటుంద‌న్నారు. త‌మ పాల‌న‌లో అవినీతి జ‌ర‌గ‌లేద‌ని ద‌మ్ముంటే కేసీఆర్ నిరూపించుకోవాల‌ని స‌వాల్ కూడా చేశారు ల‌క్ష్మ‌ణ్. తెరాస మెక్కిందంతా క‌క్కించ‌డానికి మోడీ ఉన్నార‌నీ, అమిత్ షా ఉన్నార‌ని కూడా హెచ్చ‌రించారు. మొత్తానికి, కేసీఆర పాల‌న అంతా అవినీతి మ‌య‌మే అనే ఆరోప‌ణ‌ల్ని పెద్ద ఎత్తు చేయ‌డం మొద‌లుపెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com