పీసీసీ పీఠం ఆశతో మున్సిపోల్స్ మీద ఆశావహుల శ్రద్ధ..?

నాయకులతో మనస్ఫూర్తిగా పార్టీ కోసం పని చేయించుకోవడం తెలంగాణ కాంగ్రెస్ కి ఎప్పుడూ సవాలే. ఏదో ఒక లొల్లితో పార్టీకి అవసరమైన సమయాల్లో కూడా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరని సందర్భాలే ఎక్కువ. కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది నేతలు వారి సొంత నియోజక వర్గాల్లో పార్టీ గెలుపు కోసం బాగానే కష్టపడుతున్నారు.

కార్పొరేషన్ల బాధ్యతల్ని పార్టీలో సీనియర్లైన పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, వీ హన్మంతరావు, షబ్బీర్ అలీ తదితరులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, తమ స్థాయికి తగ్గ బాధ్యతలు ఇవి కావు అని మొదట్లో కాస్త బెట్టు చేసినా… ఇప్పుడు పార్టీ గెలుపు కోసంగా కసిగానే పనిచేస్తున్నారట. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజక వర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో తీవ్రంగానే ప్రచారం చేస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయారు కాబట్టి, ఈసారైనా పరువు దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఆయన ఉన్నారు. ఇక, మిగతా నేతల్ని బలంగా మోటివేట్ చేస్తున్నది… పీసీసీ అధ్యక్ష పదవి. త్వరలోనే కొత్త అధ్యక్షుడి నియామకం ఉంది. దీంతో, ఈ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు సాధించి పెట్టామనీ, హైకమాండ్ ముందు తమ బలం ఇదీ అని నిరూపించుకోవాలనే స్ఫూర్తితో ఆశావహ నేతలు పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది.

పీసీసీ ఆశావహుల్లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ స్థానం పరిధితోపాటు, నల్గొండ అసెంబ్లీ పరిధిలో కూడా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. శ్రీధర్ బాబు కూడా తన నియోజక వర్గంతోపాటు, ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న భూపాలపల్లి జిల్లాలో కూడా బాధ్యతలన్నీ తానే నెత్తిన వేసుకున్నారట. మల్కాజ్ గిరి, కొడంగల్ లో రేవంత్ కూడా పార్టీని గెలిపించే పట్టుదలతో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పీసీసీ రేసులో ఉన్నామని స్వీయ ప్రకటన చేసుకున్న నాయకులంతా మున్సిపల్ ఎన్నికల్ని సీరియస్ గానే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యం కావడం… ఈరకంగా నాయకుల్లో మోటివేషన్ కి పనికొస్తోందని చెప్పొచ్చు. అయితే, మంచి ఫలితాలు సాధించాలంటే నాయకుల్లో స్ఫూర్తితోపాటు సరైన వ్యూహాలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త ఉత్సాహం కాంగ్రెస్ కి ఏ స్థాయి ఫలితాలను రాబట్టేందుకు పనికొస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com