అమరావతిని ఏపీ రాజధానిగా నోటిఫై చేయించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గెజిట్ పార్లమెంట్ లో ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బిల్లును రెడీ చేసి న్యాయశాఖకు పంపారు. న్యాయశాఖ ఆ బిల్లు విషయంలో కొన్ని అభ్యంతరాలు పెట్టి వెనక్కి పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం బయటకు తెలియగానే వైసీపీ మీడియా , నేతలు తెగ సంబరపడిపోయారు. అమరావతికి ఏదో అడ్డంకి వచ్చేసిందని ఆనందపడిపోయారు. వారు తీరు చూస్తే.. రాక్షాసానందం అంటే తక్కువగా ఉంటుందేమో?. అమరావతికి ఏ చిన్న ఆటంకం వచ్చినా వారి కడుపు నిండిపోతోంది.
గెజిట్కు సమస్య లేదు .. చిన్న లీగల్ చిక్కులే!
ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర విభజన చట్టంలోనే పెట్టేలా ప్రయత్నాలు చేసింది. అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడే అమరావతిని రాజధానిగా ఖరారు చేసినట్లుగా బిల్లు మార్చాలనుకున్నారు. ఆ విధంగా బిల్లు రెడీ అయినా.. న్యాయనిపుణులకు కొన్ని సందేహాలు వచ్చాయి. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను బిల్లులో పెట్టినందున.. శాశ్వత రాజధాని అనే ప్రస్తావన ఆ మధ్య కాలంలో తీసుకొచ్చి చట్టంలో పెడితే సమస్యలు వస్తాయని అంచనా వేశారు. భవిష్యత్ లో ఎలాంటి లీగల్ వివాదాలకు అవకాశం ఇవ్వకూడదనుకుంటున్న ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ టైం ముగిసిన తర్వాత నుంచే రాజధానిగా అమరావతి పేరు మీద గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని బిల్లు మార్చారు.
ఈ సమావేశాల్లోనే గెజిట్ ఖాయం
ఏపీ రాజధాని అమరావతిగా కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే గెజిట్ జారీ కావడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బాధ్యత తీసుకున్నారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా ఈ గెజిట్ వస్తుంది. నిజానికి దేశంలో ఏ రాష్ట్రానికి .. ఆ రాష్ట్ర రాజధాని అదేనని గెజిట్ జారీ చేయరు. కానీ ఏపీ రాజధాని ప్రత్యేకం. కొన్ని వేల మంది రైతుల త్యాగాల పునాదుల మీద ఏర్పడుతోంది. ఆ రైతులపై చాలా మంది కుట్రలు చేస్తున్నారు. వారి నుంచి కాపాడాలంటే.. భరోసా ఇవ్వాలంటే గెజిట్ అవసరం అయింది. రాజ్యాంగ నిర్మాతలు సొంత రాష్ట్రాలపైనే కుట్రలు చేసే రాజకీయ నేతలు పుడతారని ఊహించి ఉండరు. అందుకే తప్పడం లేదు.
నిర్వర్యం చేయాలనుకున్నా.. చేయలేని విధంగా అమరావతి అభివృద్ధి
నిర్వీర్యం చేయాలనుకున్నా సరే చేయలేని విధంగా అమరావతిలో మార్పు జరుగుతోంది. ఏడాదిన్నరకే చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మరో ఏడాదిన్నరకు .. చాలా వరకూ విజిబుల్ అభివృద్ధి కనిపిస్తుంది కార్యాలయాలు ప్రారంభమవుతాయి. ఐకానిక్ టవర్లు.. మరో రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి. కేంద్ర కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, హోటళ్లు అన్నీ ఆపరేషన్ లోకి వస్తాయి. అమరావతి చుట్టూ ఓ ఆర్థిక సామ్రాజ్యం ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేసినా .. ఎన్ని కుట్రలు చేసినా ఇంచ్ కూడా కదిలించలేరు. కానీ వారికి అమరావతికి ఏ చిన్న దెబ్బ తగిలినా.. ఆటంకం కలిగినా మహా ఆనందం అవుతోంది. ఆ ఆనందం కోసం కుట్రలు చేసేందుకు వెనుకాడటం లేదు.
