“If the abuse be enormous, nature will rise up and, claiming her original rights, overturn a corrupt political system.”
“ అణచివేత అతి భయంకరంగా ఉంటే, ప్రకృతి లేచి తన మొదటి హక్కులను కోరుకుంటూ, అవినీతి పాలిత వ్యవస్థను పడగొడుతుంది” అని శామ్యూల్ జాన్సన్ అనే బ్రిటిష్ రాజకీయ విమర్శకుడు 1791లో వ్యాఖ్యానించారు. అప్పటి బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ విషయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ మాట 200 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో నిరూపితమవుతూనే ఉంది. దానికి తాజా సాక్ష్యం నేపాల్. అంతకు ముందు బంగ్లాదేశ్.. అంతకు ముందు శ్రీలంక. రేపు మరో దేశం కావొచ్చు. ప్రజాస్వామ్య సూత్రాలను మర్చిపోయే పాలకులు ఉన్నప్పుడు ఏ దేశంలో అయినా ఇదే జరుగుతుంది. కాకపోతే ఆ సహనం బద్దలయ్యేలా పాలకుల మూర్ఖత్వం పెరిగిపోవాలి. వారు జాగ్రత్త పడితే ప్రజాస్వామ్యమే కాదు..దేశం కూడా భద్రంగా ఉంటుంది.
సహనం నశించిన యువత తిరుగుబాటు
నేపాల్‌లో జనరేషన్ జెడ్ యువత చేసిన తిరుగుబాటు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పార్లమెంట్ భవనాన్ని సైతం తగులబెట్టారు. ఓ మాజీ ప్రధాని భార్యను సజీవ దహనం చేశారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినా వారు తగ్గలేదు. ఆయన ఇంటిని తగులబెట్టారు. ప్రధానిని కాపాడటానికి ఆర్మీ హెలికాప్టర్ ఓ. పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. అలాంటి తిరుగుబాటు ఓ సంచలనమే. అయితే అది రావడానికి దారి తీసిన పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి. ప్రపంచంతో పాటు నేపాల్‌ను ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ పెద్దలు, యువతపై అణిచివేత ప్రారంభించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారు. చివరికి సోషల్ మీడియా మీద కూడా బ్యాన్ విధించారు. దీంతో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేపాల్ ప్రజలు ఇలాంటి నిర్బంధాలను ఎదుర్కొన్న చరిత్ర ఉన్నవారు. గతంలో రాజ్యాంగ సంస్కరణలు, ప్రజాస్వామ్య స్థాపన, రాచరిక వ్యవస్థ రద్దు కోసం ఇలాంటి ఉద్యమాలు చేశారు.
రాచరికానికి, ప్రజాస్వామ్యానికి తేడా చూపలేకపోయిన పాలకులు
నేపాల్ చరిత్రలో ఉద్యమాలు చాలా ఉన్నాయి. 104 సంవత్సరాల పాటు నేపాల్‌ను పాలించిన రాణా రాజవంశం నిరంకుశ పాలన సాగించింది. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం నుండి ప్రేరణ పొందిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ, రాజా త్రిభువన్ మద్దతుతో ఈ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. 1951లో రాణా రాజవంశం పతనమైంది. బహుపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపితమయింది. ఆ తర్వాత 1960లో రాజా మహేంద్ర బహుపార్టీ వ్యవస్థను రద్దు చేసి, నిరంకుశ పంచాయత్ వ్యవస్థను స్థాపించారు. పార్టీలపై నిషేధం విధించారు. పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు , సమ్మెల తర్వాత, రాజా బీరేంద్ర 1990లో పంచాయత్ వ్యవస్థను రద్దు చేసి, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. 2001లో రాజా జ్ఞానేంద్ర రాజ్యాంగాన్ని రద్దు చేసి, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, మావోయిస్టులు కలిసి ఉద్యమం చేశారు. విస్తృతమైన నిరసనలు, సమ్మెలు, హింసాత్మక ఘర్షణలు జరిగాయి. రాజా జ్ఞానేంద్ర 2006లో అధికారాన్ని వదులుకున్నారు. శాంతి ఒప్పందంతో ఈ తిరుగుబాటు ముగిసింది. 2008లో నేపాల్ రాచరిక వ్యవస్థ రద్దయింది. నేపాల్ సమాఖ్య ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా మారింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ రాచరికానికి, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మధ్య తేడాను చూపించడంలో నేపాలీ పాలకులు విఫలమయ్యారు. రాజుల మాదిరిగానే అణిచివేతకు పాల్పడటంతో తిరుగుబాటు తీవ్రం అయింది.
విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వాల వైఫల్యం
నేపాల్ యువత ప్రజాస్వామ్య ఫలాలను అందుకోలేకపోయారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు నేపాల్ కు ఉన్న ప్రకృతి వనరులు, మానవ వనరుల్ని వినియోగించుకుని ఆర్థికాభివృద్ధిని చేసి.. ప్రపంచంతో పాటు ముందుకు తీసుకెళ్తారని అనుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నేపాల్ యువత ఆశలు తీరడం లేదు. నేపాల్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం 5-29 సంవత్సరాల వయస్సు ఉన్న నేపాలీలు విదేశాలకు వెళ్లి పని చేసి.. అక్కడి నుంచి పంపే డబ్బు. యువత ఎక్కువగా విదేశాలకు వలసలు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. నేపాల్ యువతలో అత్యధిక మంది మలేషియా, కతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా వంటి దేశాలకు వలసలు వెళ్తున్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో రెమిటెన్స్ నుండి సుమారు 10.8 బిలియన్ డాలర్లు నేపాల్‌కు వచ్చాయి, ఇది దేశ GDPలో 33 శాతం. అంటే ఇతర రంగాలు ఎంత దారుణంగా ఉన్నాయో అంచనా వేయవచ్చు. గ్రామీణ యువతలో కొంతమంది వ్యవసాయం , టూరిజం వంటి వాటి మీద ఆధారపడతారు. కానీ ఇవి ప్రధాన ఆధారం కాదు. నేపాల్‌కు ఎన్నో సహజ వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు యువతకు కావాల్సిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించడం మర్చిపోయింది.. ఆర్థిక వృద్ధి లేకపోవడం కారణంగా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు చాలా దిగువ స్థాయిలో ఉంటాయి. సగానికిపైగా జనాభా పేదరికంలో ఉంటారు. చేసుకోవడానికి పనులు లేకపోవడం వల్ల యువతలో అసహనం పెరిగిపోయింది. అదే సమయంలో పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో నేపాలీ రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం ప్రజల్లో ఆగ్రహానికి గురి చేసింది. అధికార, ప్రతిపక్ష నేత అవినీతి దాహం, ఆస్తులను పోగేసుకోవడం.. ప్రజలంతా కష్టాల్లో ఉన్నా వారు మాత్రం జల్సాలు చేస్తూండటంతో జెన్ జెడ్ యువత అసహనం కట్టలు తెగిపోయింది. ఆ పర్యవసానాలు ఏమిటో మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ ప్రజా ప్రభుత్వం లేదు. ఏర్పడే అవకాశం లేదు. దానికి కారణం.. రాజకీయ నేతలపైనా అక్కడి యువత నమ్మకం కోల్పోయారు. ఇది చాలా ప్రమాదకర పరిణామం.
శ్రీలంక, బంగ్లాల్లోనూ పాలకుల అతి నిరంకుశత్వమే విప్లవానికి కారణం !
గత ఏడాది బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. ప్రధాని షేక్ హసీనాను అక్కడి యువత తరిమికొట్టింది. దానికి కారణాలేమిటన్నదానికి విశ్లేషిస్తే ప్రధానంగా కనిపించేది అణిచివేతే. నిజానికి బంగ్లాదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. కానీ షేక్ హసీనా రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యమం వచ్చింది. చివరికి అది ప్రజా ప్రభుత్వం పారిపోవాల్సిన పరిస్థితిని కల్పించింది. ఇప్పుడు అక్కడ ప్రజా ప్రభుత్వం లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రభుత్వం ఉంది. ఉద్యమకారుల డిమాండ్ల మేరకు ప్రభుత్వం నడుస్తోంది. ఈ ఉద్యమం ప్రజలందరి అభిప్రాయాలకు తగ్గట్లుగా ఉంటుందని అనుకోలేరు. కానీ జరగాల్సినా నష్టం జరిగిపోయింది. అంతకు ముందు శ్రీలంక రాజకీయ నేతల చేతకానితనం, చైనా అప్పుల కారణంగా ప్రజలు చితికిపోయారు. అవినీతి కారణంగా శ్రీలంక ప్రజల బతుకు దుర్భరంగా మారింది. కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం మారింది. ఇలాంటివన్నీ చూసినప్పుడు అధికారం చేతికి అందిందని.. ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని.. ప్రజల్ని భయపెట్టి.. అణిచివేసి.. అడ్డగోలు రాజకీయం చేయడం ద్వారానే ఎక్కువగా తిరుగుబాట్లు వస్తాయని అర్థమవుతుంది.
భారత రాజకీయ నేతలు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు !
యాధృచ్చికమో, అంతర్జాతీయకుట్ర ఉందో కానీ ఇవన్నీ భారత్ పొరుగుదేశాల్లోనే దేశాల్లోనే వెంట వెంటనే జరిగిపోతున్నాయి. అందుకే భారత్ లోనూ ఇలాంటివి జరుగుతాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే జరుగుతాయో లేదో తర్వాత సంగతి కానీ జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మన రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉన్నాయి. పాలకులు మాత్రమే.. కాదు మొత్తం వ్యవస్థ ఈ పరిణామాలను విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఆయా దేశాల పరిస్థితులతో పోలిస్తే.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్.. చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉంది. ప్రజలకు కనీస అవసరాలు అందుతున్నాయి. ఇంకా పేదరిక ఆనవాళ్లు ఉన్నప్పటికీ.. మారుతున్న కాలంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయి. విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవసరాలు తీరుతున్నాయి. పైగా ఇంకా. మన దేశానికి ఇతర దేశాల నుంచి ఈ అవసరాల కోసం వస్తున్నారు. యువత ఎవరూ ఖాళీగా ఉండటం లేదు. వ్యవసాయ రంగం నుంచి అనేక రంగాల్లో దిగువ స్థాయి ఉపాధి అవకాశాలకు దొరక్క యాంత్రీకరణ మీద ఆధారపడుతున్నారు. ప్రజలు మరింత ఉన్నతమైన జీవితం కోసం.. కష్టపడుతున్నారు. దానికి తగ్గ అవకాశాలు అదించేందుకు ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి. అయితే ప్రభుత్వ పరంగా ప్రజలకు వీలైనంత తక్కువ కష్టాలు తమ వైపు నుంచి వచ్చేలా చూసి.. ఆగ్రహం పెరగకుండా చూసుకోవడం మాత్రమే కాదు.. ప్రజల స్వేచ్చను హరించే ప్రయత్నం చేయడం కూడా తిరుగుబాట్లకు కారణం అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. నేపాల్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమే.. కానీ అక్కడ నిర్ణయాలేవీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా లేవు. ఇక్కడ అలాంటి పొరపాట్లు ప్రభుత్వాలు చేయడం లేదు. రైతు చట్టాలను తీసుకు వచ్చారు.. కానీ ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తే సరికి ఏ మాత్రం బేషజాలకు పోకుండా రద్దు చేశారు. సుదీర్ఘ పోరాటాలు రైతులు చేశారు కానీ అది తిరుగుబాటు వరకూ వెళ్లలేదు. అదే భారత ప్రజాస్వామ్య గొప్పతనం.
అసహనం ఉంటే బ్యాలెట్లతోనే చూపిస్తారు ప్రజలు !
ఒక వేళ భారత్ లో ఇలాంటి తిరుగుబాటు రావాలంటే దేశమొత్తం సాధ్యం కాదు. ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పుడు .. ఆ ప్రభుత్వ తమ తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేయనప్పుడు మాత్రం తప్పదు. గతంలో యూపీఏ ప్రభుత్వం పదేళ్ల కాలంపై పెరిగిన వ్యతిరేకత.. ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం కేసుతో దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారింది. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంపై వెల్లడి అయిన ఆగ్రహం.. కేవలం ఆ ఒక్క నిర్భయ ఘటన కారణంగా కాదు.. పేరుకుపోయిన అవినీతి, అసమర్థత ఇతర కారణాలు కూడా. ఆ తర్వాత సమీపంలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ప్రజలు తమ కోపాన్ని చూపించారు. అదే అసలైన తిరుగుబాటు. ప్రభుత్వం మారిపోయింది. మళ్లీ ఇప్పటి వరకూ యూపీఏ ప్రభుత్వం రాలేదు. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉండేవి. ప్రజా ప్రభుత్వాలు అన్నీ.. ప్రజలను, చట్టాలను గౌరవిస్తూ ఉంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కొన్నాళ్లు అరాచకాలు చోటు చేసుకున్నాయి. ప్రజలు తమ తిరిగుబాటును ఎన్నికల సమయంలో ఓటు ఆయుధంగా చూపారు. అదే మన దేశంలో జరిగే తిరుగుబాటు. ప్రజలకు ఓటు అనే ఆయుధంగా చేతుల్లో ఉంటుంది. దానితోనే ఊచకోత కోస్తారు. దానితోనే కుర్చీలు లాగేస్తారు. అందుకే దేశంలో విప్లవం..తిరుగుబాటు బ్యాలెట్ ద్వారానే వస్తుంది కానీ.. హింస ద్వారా రాదు. రాజకీయ నేతలు దీన్ని గుర్తించాల్సిన అవసరం మాత్రం ఉంది. పొరుగుదేశాల పరిణామాలతో గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాత్రం మన రాజకీయ వ్యవస్థకు కనిపిస్తోంది.