వైసీపీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుక , ఆమె భర్త నీలకంఠంకు చెందిన భారీ ఆస్తులను వేలం వేయడానికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటనలు ఇచ్చింది. వీరు తమ వ్యాపార అవసరాల కోసం గతంలో తీసుకున్న భారీ రుణాలను చెల్లించడం మానేశారు. ప్రస్తుతం వీరు ఎల్ఐసీకి దాదాపుగా 782 కోట్ల రూపాయల మేర బాకీ పడ్డారు. ఈ క్రమంలోనే బకాయిల రికవరీ కోసం వారి ఆస్తులు క్రమంగా వేలం వేస్తున్నారు. తాజాగా బెంగళూరు ఎల్ఐసీ హెచ్ ఎఫ్ఎల్ కూకట్ పల్లిలోని మెరీడియన్ స్కూల్ ను వేలం వేస్తున్నట్లుగా ప్రకటన ఇచ్చింది.
ఇవే కాకుండా తనఖా పెట్టిన ఆస్తుల జాబితాలో హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులు ఉన్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7 లోని 5,426 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న మెరీడియన్ స్కూల్ భవనం, అక్కడి ఫర్నిచర్ ,కంప్యూటర్లను కూడా వేలం వేయనున్నారు. దీనితో పాటు మాదాపూర్ సమీపంలోని ఖానామెట్‌లో ఉన్న 7,205 చదరపు గజాల ఖాళీ స్థలం , బుట్టా కన్వెన్షన్ సెంటర్ వంటి ఆస్తులు కూడా వేలం జాబితాలో ఉన్నాయి. ఈ ఆస్తులన్నింటికీ కలిపి తాము ఇచ్చిన అసలు, వడ్డీ రాబట్టుకోవాలని ఎల్ఐసీ ప్రయత్నిస్తోంది.
బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్, మెరీడియన్ ఎడ్యుటెక్ సంస్థల పేరుతో తీసుకున్న ఈ రుణాల వ్యవహారం ఇప్పటికే న్యాయపరమైన మలుపులు తిరిగింది. గతంలో కోవిడ్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయని, రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని వారు కోరినప్పటికీ, నిబంధనల ప్రకారం చెల్లింపులు జరగకపోవడంతో బ్యాంకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
