ఈటీవీ విన్ ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో స్పీడు పెంచింది. 90s, వీరాంజనీలు విహారయాత్ర, అనగనగా, ఎయిర్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ అందుకున్నాయి. ఇప్పుడు యువ నటీనటులు మౌలి, శివానీ నాగారం కీలక పాత్రల్లో ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. సాయి మార్తాండ్ దర్శకుడు.
తాజాగా టీజర్ విడుదలైంది. ఇంటర్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. ఇంటర్ ప్రేమలు అనగానే నిబ్బా లవ్ స్టోరీస్ అనే ముద్రపడే ఛాన్స్ ఎక్కువ. అయితే ఈ కథని డీసెంట్‌గా డీల్ చేశారని టీజర్ చూస్తే అర్థమౌతుంది. టీజర్లో కొన్ని నోస్టాల్జిక్ మూమెంట్స్ ఉన్నాయి. ఎంసెట్ కోచింగ్, కుర్రాళ్ల గొడవలు, ఇంట్లో చీవాట్లు, ఓ క్యూట్ లవ్ స్టోరీ ఇవన్నీ మేళవింపుతో టీజర్ వదిలారు.
‘ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరినీ ఎందుకు కంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్‌కి ఒకడు పోయినా… ఇంకొకడు ఉంటాడని’ ఈ డైలాగ్ టీజర్లో కొసమెరుపు.
అనగనగా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత కొన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. అయితే ‘లిటిల్ హార్ట్స్’ని మాత్రం ముందుగా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది.