ఫెయిల్యూర్ స్టోరీ : లోకేష్ తప్పెక్కడ చేశారు..?

తెలుగుదేశం పార్టీ గెలుపోటములు చాలా చూసింది. కానీ ఈ సారి ఓటమి బాధ నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే.. వారసుడిగా తెరపైకి వచ్చిన లోకేష్‌ కూడా ఘోరపరాజయం పాలయ్యారు. చంద్రబాబు తన ప్రయత్నంగా లోకేష్‌ను.. రాజకీయాల్లోకి తీసుకు రాగలిగారు. కానీ.. మిగతా అంతా ఆయన సామర్థ్యం మీదే నడవాల్సింది. ఇప్పుడు నాయకత్వ సామర్థ్యం చూపించాల్సింది లోకేషే..!. కానీ ఆయన తొలి ప్రయత్నంలో ఫెయిలయ్యారు. అసలు తప్పు ఎక్కడ జరిగింది..?

మాస్ రాజకీయం చేయడంలో ఫెయిల్..!

నందమూరి తారక రామారావు మనవడు, చంద్రబాబునాయుడు కుమారుడు అంటే.. ప్రజల్లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. రాజకీయ పరంగా అయితే అవి మరీ ఎక్కువ. తాత, తండ్రులకు తగ్గ డైనమిక్ రాజకీయం చేస్తారని ఎవరైనా ఊహించుకుంటారు. కానీ ప్రత్యక్షంగా వచ్చే సరికి.. లోకేష్ సూపర్ రిచ్ క్లాస్ రాజకీయాలకు పరిమితమయ్యారు. పరిధులు దాటని భాష, అంతకు మించి.. మంత్రిగా… పనితీరుతో… ఏదో చేసి చూపించాలనే తపన పడ్డారు కానీ… జన రాజకీయంలో మాత్రం ఫెయిలయ్యారు. ప్రజల్లో తనదైన ముద్రవేయడంలో మాత్రం విఫలమయ్యారు. ఆ విషయం మంగళగిరి ఫలితంతో తేలిపోయింది. సాధారణంగా.. చంద్రబాబు వారసుడు పోటీ చేస్తున్నాడంటే.. ఎలాంటి నియోజకవర్గం అయినా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. కానీ లోకేష్… మంగళగిరి మొత్తం తిరిగి శ్రమించినా.. ప్రజల్లో… మన కోసం వచ్చాడనే నమ్మకం కలిగించలేకపోయారు. ఆయన గెలిచినా.. ఎక్కడో ఉంటాడనే అభిప్రాయాన్ని మార్చలేకపోయారు.

రాజకీయ ప్రత్యర్థులపై సాఫ్ట్‌కార్నర్‌తో అసలుకే మోసం..!

ఇప్పుడు రాజకీయాలు డైనమిక్ గా మారిపోయాయి. ఎంత డైనమిక్ అంటే… ప్రత్యర్థి పార్టీ మంచి చేసినా.. చెడు చేసినా.. చెడామడా… తిట్టేయడమే. ఎంత మాస్‌గా విమర్శిస్తే.. అంత మాస్ లీడర్ అనుకునే రోజులు వచ్చాయి. ఇక్కడ మాస్ అంటే.. రోజా, విజయసాయిరెడ్డి తోపాటు.. వైసీపీ నేతలందరూ మాట్లాడే మాటలే. లోకేష్ మాత్రం.. ఉన్నత విద్యావంతుడు. తాను అలా.. గౌరవం తప్పి మాట్లాడలేనన్నట్లుగా వ్యవహరిస్తూంటారు. అందుకే.. ఆయనను.. వైసీపీ నేతలు.. ముఖ్యంగా రోజా లాంటి నేతలు “పప్పు” అంటూ ఉంటారు. అలా అన్న వాళ్లకు అదే రీతిలో సమాధానం చెప్పినప్పుడే మాస్ లీడర్ అవుతారు. అంతే కానీ… వాళ్లు అలా అన్నారని… మనం అలా అవ్వాల్సిన పని లేదని.. సైలెంట్‌గా ఉండే… ఇప్పటి రాజకీయాల్లో బండి నడవదు. అదే జరిగింది. లోకేష్‌కు రాజకీయాలు చేతకావన్నంత ప్రచారం జరిగిపోతోంది.

స్టాన్ ఫర్డ్ టీం .. మిడిల్ క్లాస్ నాడి ఎలా పట్టుకుంటుంది..?

ముఖ్యమంత్రి కుమారునిగా.. స్టాన్ ఫర్డ్‌లో చదువుకున్న వ్యక్తిగా.. లోకేష్..మేనేజ్ మెంట్ స్క్రిల్స్ బాగుండొచ్చు. కానీ.. తన టీం గొప్పగా లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. మంగళగిరిలో… లోకేష్ ఓటమిలో.. ఆయన టీం… అవగాహనా రాహిత్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక నేతలను సమన్వయం చేసుకోవడంలోనూ.. ఫెయిలయ్యారని… తేలిపోయింది. లోకేష్ ఇప్పటికీ.. రాజకీయాలకు సంబంధించినంత వరకూ..కింది స్థాయి నుంచి ఎదిగిన ఓ టీంను… ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. విదేశాల్లో చదవి.. ఏసీ రూముల్లో కూర్చుని పని చేసేవారితో… పనులు కావు. లోకేష్ ఓటమిలో ఆయన టీం బాధ్యతే ఎక్కువగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com