లోకేశ్ తీరుతో టీడీపీలో పెరుగుతున్న దూకుడు

నారా లోకేశ్‌.. పంచాయ‌తీ, ఐటీ శాఖ‌ల మంత్రి….ఎట్ట‌కేల‌కు.. విమ‌ర్శ‌ల‌కు ఒక ప‌దునైన స‌మాధానాన్ని చెప్పారు. త‌న‌ను ప‌ప్పూ అనీ, అవినీతిప‌రుడ‌నీ ఎలా విమ‌ర్శిస్తారంటూ తెలివిగా ప్ర‌శ్నించారు. తాను ప‌ప్పునైతే అవినీతికి ఎలా పాల్ప‌డ‌గ‌ల‌న‌నీ, అలాగే అవినీతి ప‌రుడ‌నైతే మొద్దునెలా అవుతాన‌నీ విమ‌ర్శ‌నా బాణాన్ని సంధించారు. మంత్రిగా తాను ఐటీ రంగంలో ఇంత‌వ‌ర‌కూ 1650 మందికి పైగా ఉద్యోగాల‌ను క‌ల్పించాన‌న్నారు. లోకేశ్‌పై ప్ర‌తిప‌క్ష నేత‌లూ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా విభాగం వ్యంగ్య పోస్టుల‌తో ముప్పేట దాడి చేస్తున్నారు. ఆయ‌న నోరు విప్పితే చాలు రంధ్రాన్వేష‌ణ‌కు దిగుతున్నారు. ఆయ‌న‌కు ప‌ప్పు అని పేరు పెట్టి విమ‌ర్శ‌లు సంధించారు. ఇంత‌వ‌ర‌కూ బ‌హిరంగంగా ఆయా విమ‌ర్శ‌ల‌పై నోరుమెద‌ప‌ని లోకేశ్ నిన్న స‌మాధానం చెప్పారు. ఈ స‌మాధానానికి విమ‌ర్శ‌కులు ఏం స‌మాధానం చెబుతారో చూడాల్సి ఉంది.
ప్ర‌తిప‌క్షాల‌నూ, వారు చేసే విమ‌ర్శ‌ల‌నూ ఎదుర్కొన‌డంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకూ, ఆయన కుమారుడు లోకేశ్‌కు చాలా తేడా ఉంది. విమ‌ర్శ‌ల‌కు చంద్ర‌బాబు ఎప్పుడూ జ‌డిసేవారు కాదు. పైగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకునే వారు కాదాయ‌న‌. ఆ వైఖ‌రివ‌ల్ల ప్ర‌తిప‌క్షాల‌కు ఎక్కువ అవ‌కాశం చిక్కేది కాదు. ఏం విమ‌ర్శించినా స‌బ్జెక్టుకోసం చూసే వారు త‌ప్ప వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు త‌క్కువుండేవి. డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ విప‌క్ష నేత అయిన ద‌గ్గ‌ర్నుంచి వారి విమ‌ర్శ‌లు కొత్త పుంత‌లు తొక్కాయి. వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై కూడా దుమ్మెత్తి పోసుకోవ‌డం ప్రారంభించారు. లోకేశ్ రాజ‌కీయాల్లోకి త‌ర‌వాత ప‌రిస్థితి మారింది. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ను సైతం ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకుంటూ వాటికి ఏదో ఒక ద‌శ‌లో చెక్ పెట్టాల‌ని భావించారు. సోష‌ల్ మీడియాను ల‌క్ష్యం చేసుకున్నారు. టీడీపీని అభాసుపాలు చేస్తున్న పోస్టుల‌ను సునిశితంగా ప‌రిశీలించడం ప్రారంభించారు. ఎమ్మెల్సీగా లోకేశ్ ఎంపికైన అంశాన్ని ఎంపిక చేసుకుని పొలిటిక‌ల్ పంచ్ అనే ఫేస్‌బుక్ పేజీ శాస‌న మండ‌లి నేప‌థ్యంలో పెట్టిన పోస్టును సీరియ‌స్‌గా తీసుకున్నారు. మండ‌లిని అప్ర‌తిష్ట‌పాలు చేశారంటూ పోలీసు కేసు పెట్టారు. ఇక‌పై తానేం చేయ‌బోతున్నానో చెప్ప‌క‌నే చెప్పారు. అదే స‌మ‌యంలో టీడీపీ అఫిషియ‌ల్ ఫేస్‌బుక్ పేజీలో వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి, పెట్టిన అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌పై ఆ పార్టీ ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగం అధ్య‌క్షుడు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు ప‌ట్టించుకోలేదు. దీనిపై కూడా కేసు పెట్టుంటే… హుందాగా ఉండేది. ప్ర‌భుత్వ వైఖ‌రిపై స‌మాజానికి స్ప‌ష్ట‌మైన సంకేతాలు వెళ్ళుండేవి. అస‌భ్య‌, అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌కు చెక్ ప‌డి ఉండేది. ప్ర‌భుత్వ క‌త్తికి రెండు వైపులా ప‌దునుంద‌ని నిరూపించుకుని ఉండుంటే ఇది సాధ్య‌ప‌డేది. రాజ‌కీయ క‌క్ష‌ల‌తో కాకుండా సిద్ధాంత‌ప‌రంగా విమ‌ర్శ‌లు, వ్యాఖ్య‌లు, చ‌ర్య‌లుంటే.. అంతా స‌వ్యంగా ఉంద‌ని చెప్పుకునే వీలుండేది. ఇదే లోకేశ్ అప‌రిప‌క్వ‌త‌ను చాటుతోంది. అయిన‌ప్ప‌టికీ లోకేశ్ తీరు టీడీపీలో కొంత దూకుడును పెంచుతోంది.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.