కృష్ణాజలాల వాటాలో నష్టపోతున్న ఎపి! * ముఖ్యమంత్రి మాటలు * పట్టించకోని అధికారులు

ఖరారైపోయిన వాటాల ప్రకారమే నదీజలాలు పంచకోవాలంటే నీరు లేని సమయంలో దిగువ రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఇలాకాకుండా నీరు తక్కువగా వున్న సంవత్సరాల్లో అందుబాటులో వున్న నీటిని ముందుగానే ఖరారైన వాటాల కు ప్రపోర్షనేట్ (దామాషా) గా పంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సార్లు సూచించారు. అయితే ఈ సూచనను అమలు చేయించకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయలేదు. అంతకుమించి వచ్చిన అవకాశాలను కూడా విడిచిపెట్టేశారు.

ముఖ్యమంత్రి, మంత్రుల ఆలోచనలకు, విధాన నిర్ణయాలకు- వాటిని అమలుచేయవలసిన అధికార యంత్రాంగానికీ మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణం…పట్టిసీమనుంచి 8 టిఎంసి లనీటిని కృష్ణా నదీకి తరలించామని ముఖ్యమంత్రి, 4 టిఎంసిలు తరలించామని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఒకేసమయంలో ప్రకటించడమే సమన్వయ రాహిత్యానికి తాజా ఉదాహరణ.

సమన్వయ లోపం లేదా అధికార యంత్రాంగం సకాలంలో స్పందించక పోవడం వల్ల కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా నష్టపోయే పరిస్ధితి దాపురించింది.

మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా, రాష్ట్రాల్లో ప్రవహించే కృష్టాజలాలను బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రాష్ట్రాల వారీగా పంచారు. అదనపు లేదా మిగులు జలాలు వున్నపుడు వాటిపై హక్కు చివరి రాష్ట్రానిదేని బచావత్ స్పష్టం చేశారు. మిగులు జలాల మాట ఎలా వున్నా నిఖర లేదా కనీస జలాలే లేని స్ధితిలో ప్రాజెక్టులు కట్టేసుకున్న మహారాష్ట్ర, కర్నాటక వచ్చిన నీటిని వచ్చినట్టే వాడేసుకుంటున్నాయి. అనంతరం ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా అన్ని రాష్ట్రాలకూ వాటాలు వేసింది. ఈ పంపకాల్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన తనకు అన్యాయం జరుగుతోందని తెలంగాణా ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళింది.

మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాలను వివాదం నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు ప్రశ్నకు సమాధానంగా కేంద్రప్రభుత్వం వివరించింది.

ఇదంతా ఆకస్మిక పరిణామం కాదు. నెలలకు నెలలే సాగిన వ్యవహారం. తరుగు సమయంలో కృష్ణాజలాలను ప్రపోర్షనేట్ గా పంచకోవాలన్న ముఖ్యమంత్రి ఆలోచనను సాధికారికమైన ప్రపోజల్ గా ప్రెజెంటేషన్ గా మార్చవలసిన బాధ్యత అధికారులదే. ట్రిబ్యునల్ విచారణలో కాని, సుప్రీంకోర్టు విచారణలో కాని, కేంద్రం సుప్రీంకోర్టుకి వివరణ ఇచ్చేముందు కాని, ఏదశలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను ప్రెజెంట్ చేసి వుంటే అంతిమ నిర్ణయం మరోలా వుండేది…కనీసం ఎపి ప్రభుత్వం మంచి సూచన చేసింది అన్న పేరు ప్రతిష్ట మిగిలేది. రాష్ట్రం నుంచి అసలు ప్రతిపాదనే వెళ్ళకపోవడం వల్ల ఘనమైన సూచనకు విలువేలేకుండా పోయింది. ఈ పరిస్ధితి ”ఢిల్లీ రైలు వెళ్ళిపోయాక రైల్లో నేను ఢిల్లీ వెళుతున్నాను” అని వీధుల్లో అరుస్తున్నట్టు వుంది.

మిగులు జలాలను అన్ని రాష్ట్రాలకు పంపకం చేయకుండా వుంటే నీటి లభ్యత తక్కువగా వున్న రోజుల్లో దామాషా పద్ధతిపై పంపకం అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యత వుండేది కాదు. కానీ, ఇప్పటి పరిస్థితుల్లో దామాషా పద్ధతిపై నీటి పంపకానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పట్టిసీమ జలాలతోనే సరిపోతుందని అలసత్వం వహించకుండా ఇప్పటికైనా జలవనరుల శాఖ అధికారులు ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణలో దామాషా పద్ధతి పంపకం ఒక అంశంగా చేర్చేందుకు కృషి చేయవలసి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com