అసలుసిసలు టెస్ట్ క్రికెట్ రుచిని చూపిస్తోంది లార్డ్స్ టెస్ట్. సమవుజ్జీలు అనే మాటకు సరైన పర్యాయపదంగా మారాయి భారత్–ఇంగ్లాండ్ జట్లు. తొలి మూడు రోజుల ఆటలో ఎవ్వరూ పై చేయి సాధించలేదు. స్కోర్స్ లెవల్ అయ్యాయి. ఇక ఆ గణాంకాలు అనవసరం. మూడు రోజుల ఆటలో ఎవ్వరూ తగ్గలేదు, పెరగలేదు.
నాలుగో రోజు ఆట మాత్రం సూపర్ థ్రిల్లర్‌గా మారింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ 58 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో లార్డ్స్ టెస్ట్ క్లైమాక్స్‌కు చేరింది. ఇక డ్రా ఉండదు. ఐదో రోజు 135 పరుగులు చేసి ఇండియా గెలవాలి. ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ నెగ్గాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఈ రోజు డిసైడ్ అయిపోతుంది.
ఐదో రోజు ఆట అంత ఈజీ కాదు. 192 పరుగుల చేజ్‌కు దిగిన ఇండియా సులువుగానే రీచ్ అవుతుందని అందరూ భావించారు. కానీ లార్డ్స్ స్లోప్ పిచ్ కారణంగా బంతి అనూహ్యంగా ప్రవర్తిస్తోంది. ఊహించని రీతిలో బంతి వికెట్ల వైపు దూసుకొస్తోంది. ఓపెనర్ జైస్వాల్ అనవసరమైన అగ్రెసివ్ షాట్ ఆడి క్యాచ్‌గా వెనుతిరిగాడు. నాయర్, గిల్ వికెట్ల ముందు దొరికిపోయారు. నైట్వాచ్మ్యాన్గా వచ్చిన ఆకాష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆకాష్ వికెట్‌ను పక్కన పెడితే భారత్ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. పంత్, నితీష్, జడేజా, సుందర్ నలుగురు బ్యాటర్లు ఉన్నారు. కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. అయితే ఐదో రోజు ఒక్క తప్పు చేసినా భారత్‌కి ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా తొలి గంటలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకూడదు. స్లోప్ కారణంగా డిఫెన్స్ కూడా కష్టమే. కానీ టెస్ట్ స్కిల్‌ను ప్రదర్శించాల్సిన సమయం ఇదే.
135 రన్స్ బోర్డ్ మీద ఈజీగానే కనిపించవచ్చు. ఒక్క బలమైన భాగస్వామ్యం దొరికినా ఈ చిన్న కొండను కరిగించడం కష్టం కాదు. కానీ అలాంటి భాగస్వామ్యం దొరకాలి. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌పై చాలా భారం ఉంది. లార్డ్స్‌లో అనుభవం కలిగిన ప్లేయర్ అతను. పంత్ కూడా కీలకం. కానీ మ్యాచ్ విన్ అయ్యేవరకూ వికెట్ల ముందు పాతుకుపోయే స్వభావం తనకు లేదు. రాహుల్ విన్నింగ్ రన్ వచ్చేవరకూ క్రీజ్‌లో ఉండాలి.
ఒక రోజంతా సమయం ఉంది. లార్డ్స్ లో ఎప్పుడు గెలిచినా అదొక చరిత్ర. అలాంటి చరిత్రను సృష్టించే అవకాశం మన ముందుంది. ఈ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవడానికి లేదు. ఇప్పుడు కావలసిందంతా అసలుసిసలైన క్రికెట్ ఆడే నైజం. ఈ విషయంలో భారత్ ఆటగాళ్లు భళా అనిపిస్తారనే అందరి ఆశ.