రివ్యూ :  ల‌వ‌ర్స్ డే

పులిహోర అంటే… చింత‌పండు, ఎండిమిర‌ప‌, వీలైతే జీడిప‌ప్పు, కాస్త ఇంగువ‌, కరివేపాకు, స‌న్న‌గా నూరిన అల్లం ముక్క‌లు…ఇలా ఓ పెద్ద లిస్టు చెప్పేయొచ్చు.  ఇవ‌న్నీ లేకుండా… అన్నంలో కాస్త ప‌సుపు క‌లిపి ‘ఇది కూడా పులిహోరే’ అంటే కాద‌న్న‌ది ఎవ‌రు? కాక‌పోతే అది కాస్త రుచి, ప‌చి లేకుండా త‌యార‌వుతుంది.  ప్రేమ క‌థ‌లూ అంతే. అల‌క‌లు, చిరుకోపాలు, న‌వ్వులు, క‌న్నీళ్లు, విడిపోవ‌డాలు, మ‌ళ్లీ క‌ల‌సుకోవ‌డాలు, కెమిస్ట్రీ ఇవ‌న్నీ ఉండాల్సిందే.
ఓ అబ్బాయిని- ఓ అమ్మాయిని తీసుకొచ్చి
‘ఇదీ ప్రేమ‌క‌థే’ అంటే ఎలా ఉంటుంది?
ఇప్పుడొచ్చిన ‘ల‌వ‌ర్స్ డే’లా త‌యార‌వుతుంది.
అప్పుడెప్పుడో ‘త్రీ’ అనే సినిమా వ‌చ్చింది. బహుశా ఈ పేరు చాలామంది మ‌ర్చిపోయి ఉంటారు. ‘కొల‌వెరి కొల‌వెరి..  అనే పాట ఉన్న సినిమా అంటే త‌ప్ప ‘త్రీ’ గుర్తుండ‌దు. ఆ పాట‌తో.. సంచ‌ల‌నం సృష్టించేశాడు ధ‌నుష్‌. ఆ పాట చూసి ‘ఇదేదో అద్భుత‌మైన సినిమాలా ఉంది’ అనుకుంటే.. తెలుగు నిర్మాత‌లు ఎగ‌బ‌డ్డారు. బోలెడంత డ‌బ్బులు పోసి కొన్నారు. తీరా చూస్తే.. ఆ పాట త‌ప్ప ఇంకేం లేదు. ఆ మాట‌కొస్తే.. వెండి తెర‌పై చూసిన‌ప్పుడు ఆ పాట కూడా బాలేదు.  ఇప్పుడు ‘ల‌వ‌ర్స్ డే’ సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింది.
ప్రియా వారియ‌ర్ క‌న్నుగీటిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో భ‌లే వైర‌ల్ అయిపోయింది. అస‌లు ఆ అమ్మాయి పేరు ప్రియా వారియ‌ర్ అనే సంగ‌తి కూడా అప్ప‌టికి తెలీదు. సోష‌ల్ మీడియా పుణ‌మా అని ఆ వీడియో.. దేశ వ్యాప్తంగా చ‌క్క‌ర్లు కొట్టింది. ఆ వీడియో పెట్టుకుని పేర‌డీలు, స్నూఫులూ చేశారు. తీరా చూస్తే.. అదో సినిమాలోని పాట అని త‌ర‌వాత అర్థ‌మైంది.  చిన్న వీడియోనే ఇలా ఉంటే, సినిమా ఇంకెలా ఉంటుందో అని ఎగ‌బ‌డ్డారంతా. ఇప్పుడ‌దే `ల‌వ‌ర్స్‌` డే పేరుతో విడుద‌లైంది.
* క‌థ‌
రోషన్ (రోష‌న్‌), ప్రియ(ప్రియా ప్రకాష్ వారియర్), గాథ (నూరిన్ షెరిఫ్)  ఈ ముగ్గ‌రూ ఇంట‌ర్ చ‌దువుతుంటారు.  రోష‌న్ తొలి చూపులోనే ప్రియ‌ని ఇష్ట‌ప‌డ‌తాడు. వారిద్ద‌రి మ‌ధ్య చిలిపి స్నేహం మొద‌లైపోతుంది. కానీ అనుకోని ప‌రిస్థితుల్లో ఇద్ద‌రూ విడిపోవాల్సివ‌స్తుంది.  దాంతో రోష‌న్.. గాధ‌కి ద‌గ్గ‌ర‌వుతాడు. `మ‌న‌మిద్ద‌రం ప్రేమలో ప‌డిన‌ట్టు న‌టిద్దాం.. అప్పుడు ప్రియ నా గురించి ఆలోచించ‌డం మొద‌లెడుతుంది` అంటూ ఇద్ద‌రూ ప్రేమ నాట‌కం ఆడ‌తారు.  కానీ… ఆ నాట‌క‌మే నిజ‌మైపోతుంది. రోష‌న్‌, గాధ ఇద్ద‌రూ నిజంగానే ప్రేమ‌లో ప‌డిపోతారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రియ ఏం చేసింది?  ఈ ముక్కోణ‌పు ప్రేమ‌గాథ ఏ తీరాన చేరింది?  అనేదే `ల‌వ‌ర్స్ డే`.
* విశ్లేష‌ణ‌
కాలేజీ క‌థ‌. అందులోనూ ప్ల‌స్ టూ.  ప్రేమకు, ఆక‌ర్ష‌ణ‌కు ఏమాత్రం తేడా తెలియ‌ని వ‌య‌సు అది. అలాంటి వ‌య‌సులో పిల్ల‌లెలా ప్ర‌వ‌ర్తిస్తారో.. చెబుతూ, వాటి మ‌ధ్య ఓ ప్రేమ క‌థ న‌డిపిద్దామ‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఇలాంటి ఆలోచ‌న త‌ప్పు కాదు. కొత్త అంత కంటే కాదు. ఈ త‌ర‌హా  ప‌రిప‌క్వ‌త లేని ప్రేమ‌క‌థలు ఇది వ‌ర‌కు చాలా వ‌చ్చాయి. వాటిలో ఇదొక‌టి అనుకోవాలంతే.  ఇంట‌ర్ మీడియ‌ట్ పిల్ల‌లు ఎంత ముదుర్లో, ఇది వ‌ర‌క‌టి సినిమాల్లో చాలా చూశాం. వాళ్ల మ‌ధ్య జ‌రిగే చిలిపి సంఘ‌ట‌న‌లు స‌న్నివేశాలుగా మారిస్తే బాగానే ఉండేది. కానీ.. ఆ వంట‌కం ఈ సినిమాలో అస్స‌లు కుద‌ర్లేదు. కొన్నిచోట్ల ముదురు డైలాగులు చెప్పించారు. ఇంకొన్ని చోట్ల వ‌య‌సుకి మించిన హావ భావ ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంటారు. కొన్నిసార్లు అమాయ‌క‌త్వం క‌న‌బ‌రుస్తూ.. ఇంకొన్నిసార్లు అతి తెలివితేట‌లు చూపిస్తుంటారు. అస‌లు ఈ క‌థ‌ని ఎలా అర్థం చేసుకోవాలో ఓ ప‌ట్టాన అర్థం కాదు. ద‌ర్శ‌కుడి ఇష్టారాజ్యానికి క‌థ న‌డిపించేశాడు.  ప్రేమ‌క‌థ‌ల్లో కెమిస్ట్రీ ఎంత ముఖ్య‌మో, సంఘ‌ర్ష‌ణ కూడా అంతే ముఖ్యం.  ఇద్ద‌రు ఎందుకు ప్రేమించుకోవాలి?  ఎందుకు విడిపోవాలి?  విడిపోయిన వాళ్లు మ‌ళ్లీ ఎందుకు క‌లుసుకోవాలి?  అనే ప్ర‌శ్న‌లు ప్రేక్ష‌కుడి ద‌గ్గ‌ర ఎప్పుడూ ఉంటాయి. వాటికి ద‌ర్శ‌కుడు స‌మాధానం చెప్పి తీరాలి.
ఓ అబ్బాయి, అమ్మాయి.. వాళ్ల చిలిపి చూపులు, వ‌య‌సు మీరిన మాట‌లు చూపిస్తే జ‌నం చూసేస్తారు అనుకోవ‌డం పొర‌పాటు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు గ‌మ‌నించ‌క‌పోవ‌డం ల‌వ‌ర్స్ డే సినిమాకి శాపంగా మారింది.  రోష‌న్ గాథ ప్రేమ‌లో ప‌డిపోవ‌డానికి లాజిక్కులు లేవు. ప్రియాతో ఉన్న‌ది కేవ‌లం ఆక‌ర్ష‌ణే అని చెప్ప‌డానికీ కార‌ణాలు లేవు.  సిల్లీ కార‌ణాల‌తో ప్రేమ పుట్టించేంత వ‌ర‌కూ ఓకే… అంతే సిల్లీగా ప్రేమికులు విడిపోయిన‌ట్టు చూపించ‌డం క‌చ్చితంగా క‌థ‌లోని లోప‌మే.  కాలేజీ అంటే, అల్ల‌రి, ఆక‌తాయి త‌నం ద‌గ్గ‌రే దర్శ‌కుడు ఆగిపోయాడు. పోనీ అదైనా అందంగా, అంద‌రూ చూడ‌ద‌గిన విధంగా చూపించాడా?  అంటే అదీ లేదు. మెచ్యూరిటీ లేని పాత్ర‌ని చూపించ‌డం వేరు, మెచ్యూరిటీ లేకుండా క‌థ రాసుకోవ‌డం వేరు. ఈ ద‌ర్శ‌కుడు రెండో ర‌కం.
ప‌తాక స‌న్నివేశాలు కూడా అలానే అనిపిస్తాయి. అప్ప‌టి వ‌ర‌కూ ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌గా న‌డిచిన ఈ క‌థ‌ని స‌డ‌న్ గా క్రైమ్ స్టోరీగా మార్చేశాడు. అలా మారిస్తే.. జ‌నం దీన్ని గీతాంజ‌లి, ప్రేమిస్తే సినిమాల్లా గుండెల్లో పెట్టుకుంటార‌ని ద‌ర్శ‌కుడు అనుకుని ఉంటాడు. విషాదం అన్న‌ది ర‌క్త‌పాతం నుంచి కాదు, పాత్ర‌ల ఎడ‌బాటు నుంచి సంఘ‌ర్ష‌ణ నుంచి పుడుతుంది.
* న‌టీన‌టులు
ప్రియా వారియ‌ర్ కోసం ఈ సినిమాకెళ్తే క‌చ్చితంగా మోస‌పోవ‌డం ఖాయం. నిజానికి ఈ సినిమాలో ప్రియావారియ‌ర్‌ది కేవ‌లం స‌హాయ‌క పాత్ర మాత్ర‌మే. ఎప్పుడైతే క‌న్నుగీటిన వీడియో పాపుల‌ర్ అయ్యిందో…. అప్పుడు ద‌ర్శ‌కుడికి ప్రియా వారియ‌ర్ పాత్ర ని పెంచుకోక త‌ప్ప‌లేదు. అందువ‌ల్ల ఆ పాత్ర నిడివి పెరిగిందే త‌ప్ప – క‌థ డిమాండ్ చేసి కాదు. క‌న్నుగీటిన వీడియో ఇది వ‌ర‌కే చూసేశాం. అక్క‌డ మిన‌హా మిగిలిన చోట్ల ప్రియా చాలా సాదాసీదాగానే క‌నిపిస్తుంది. రోష‌న్ కూడా అంతే. కాస్త‌లో కాస్త నూరిన్ మాత్రం ఆక‌ట్టుకుంటుంది.
* సాంకేతిక వ‌ర్గం
ఎలాంటి నాణ్య‌త లేని సినిమా ఇది. న‌టీన‌టులెవ‌రూ తెలీదు.. ఒక్క ప్రియావారియ‌ర్ త‌ప్ప‌. సాంకేతికంగానూ ఈ సినిమా యావ‌రేజ్ అనే ప‌దానికి ఇంకాస్త దిగువే క‌నిపిస్తుంది. సంభాష‌ణ‌లు ఏమాత్రం ఆక‌ట్టుకోవు. షాన్ రెహ‌మాన్ అందించిన పాట‌ల్లో రెండు ఓకే అనిపిస్తాయి. కేవ‌లం ప్రియా వారియ‌ర్ వీడియో వ‌ల్ల ఈ సినిమా విడుద‌ల‌కు ముందు కాస్త ఊపొచ్చింది గానీ, లేదంటే… నిజంగానే ఈ సినిమాని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు.
* తీర్పు
చ‌ట్నీ బాగుంద‌ని ఇడ్లీ తినొచ్చు. ర‌సం కోసం క‌క్కుర్తి ప‌డి అన్నం లాగించేయొచ్చు. అంతే త‌ప్ప ఓ పాట బాగుందనో, ఓ సీన్ బాగా వ‌చ్చింద‌నో సినిమా మొత్తాన్ని భ‌రించ‌లేం.. అని చెప్ప‌డానికి ఈ సినిమా  ఓ అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.
* ఫైన‌ల్ ట‌చ్‌:  అప్పుడు క‌న్నుగీటింది… ఇప్పుడు ప్రాణం తీసింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close