అమరావతి రాజధాని నిర్మాణ పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు దుండగులు మళ్లీ విధ్వంసానికి తెగబడ్డారు. గతంలో భూసమీకరణ సమయంలో చెరకు తోటలకు నిప్పు పెట్టి భయాందోళనలు సృష్టించిన తరహాలోనే, ఇప్పుడు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల కోసం తెచ్చిన భారీ పైపులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం కలకలం రేపుతోంది. అమరావతిని నిర్వీర్యం చేయాలనే వైసీపీ నేతల పాత కుట్రలే ఈ రూపంలో బయటపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. కాలిపోయిన పైపులు సామాన్యంగా నిప్పు అంటుకునే రకానికి చెందినవి కావు. అవి త్వరగా తగలబడిపోయే గుణం లేని గట్టి మెటీరియల్తో తయారైనవి. పైగా, ఆ పైపులను ఉంచిన ఓపెన్ ప్లేస్ వద్ద ఎలాంటి వంటలు చేయడం కానీ, నిప్పు పుట్టే పనులు కానీ జరగడం లేదు. అయినప్పటికీ ఆ పైపులు అగ్నికి ఆహుతి కావడం వెనుక కచ్చితంగా దుండగుల ప్రమేయం ఉందని స్పష్టమవుతోంది. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కావాలనే మంటలు పెట్టి ప్రభుత్వ ఆస్తిని నష్టం చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.
రాజధాని పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంటే, ఎలాగైనా ఆ పనులకు బ్రేక్ వేయాలని ఓటమిని జీర్ణించుకోలేని శక్తులు ఈ దాడులకు ఒడిగడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని, రాజధాని ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.


