త్రివిక్ర‌మ్ పంచ్‌.. బోయ‌పాటి ఫైట్‌.. రాజ‌మౌళి ఎలివేష‌న్‌

మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం సినిమాకి ముందు నుంచీ.. `మాస్ సినిమా` అనే ముద్ర ఉంది. ఈ సినిమాని అలానే ప్ర‌మోట్ చేస్తున్నారు. నితిన్ లుక్ ద‌గ్గ‌ర్నుంచి పాట‌ల వ‌ర‌కూ అన్నిటా మాస్ మంత్ర‌మే. ఇప్పుడు మాచ‌ర్ల నుంచి కొత్త మాస్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌లో డైలాగులా… ఒక్క మాట‌లో చెప్పాలంటే.. త్రివిక్ర‌మ్ పంచ్‌.. బోయ‌పాటి ఫైట్‌.. రాజ‌మౌళి ఎలివేష‌న్ ఇవి మూడూ ఇందులో క‌నిపిస్తున్నాయ్‌.

రెండు నిమిషాల 40 సెక‌న్ల నిడివి గ‌ల ట్రైల‌ర్ ఇది. ముందు సాఫ్ట్ గానే సాగింది. ల‌వ్ ట్రాక్‌. ఇంట్లో వెన్నెల కిషోర్ కామెడీ… `ఒరేయ్ న‌రేంద‌ర్‌… చెప్ప‌రా సురేంద‌ర్` అంటూ రాజేంద్ర ప్ర‌సాద్‌, ముర‌ళీ శ‌ర్మ‌ల ఎమోష‌న్‌.. ఇలా స‌ర‌దాగానే ట్రైల‌ర్ మొద‌లైంది. నితిన్ మాచ‌ర్ల‌లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో, అక్క‌డి నుంచి యాక్ష‌న్ ధ‌మాకా సాగిపోయింది. `రాజ‌ప్ప‌` అనే పాత్ర‌లో… స‌ముద్ర ఖ‌ని క‌నిపించాడు. మాచ‌ర్ల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి వ‌చ్చిన క‌లెక్ట‌ర్ కు రాజ‌ప్ప నుంచి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి అనేదే క‌థ‌. క‌లెక్ట‌ర్ గా.. నితిన్ గెట‌ప్‌… ఆ సెట‌ప్ అన్నీ కొత్త‌గా అనిపించాయి. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి నిజాయ‌తీగా ప‌నిచేస్తే.. ఏం సాధించ‌గ‌ల‌డో.. ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. నితిన్ ప‌లికే డైలాగుల‌న్నీ మాసీగా ఉన్నాయి. రాజ‌ప్ప‌గా స‌ముద్ర‌ఖ‌ని.. ఎలివేష‌న్లూ కుదిరాయి. వీరిద్ద‌రి మ‌ధ్యా జ‌రిగే మైండ్ గేమ్ ఎంత బాగా న‌డిస్తే.. ఈ సినిమా అంత బాగా ఆడుతుంది. ఆగ‌స్టు 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. మ‌రి ఈ క‌లెక్ట‌ర్ గారు ఏమాత్రం వినోదం పంచుతారో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.