ఈయేడాది నిర్మాతలతో పాటు డిస్టిబ్యూటర్లకు కూడా లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో MAD ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తయారవుతోంది. MAD కాలేజీ స్టోరీ అయితే…MAD 2 కొత్త పెళ్లి కొడుకుల కథ. చదువులు అయిపోయాక ముగ్గురు మిత్రులూ పెళ్లి చేసుకొంటే, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్ల కొత్త కాపురంలో ఎలాంటి గందరగోళాలు నెలకొన్నాయి? అనే ఇతివృత్తం చుట్టూ MAD 2 నడుస్తుంది. MAD లో పాటలు బాగా క్లిక్ అయ్యాయి. భీమ్స్ అందించిన బాణీలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాయి. సీక్వెల్ లో కూడా భీమ్స్ మంచి పాటల్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే లడ్డూ గాని పెళ్లి పాట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ ఐటెమ్ గీతం ఉంది. ప్రస్తుతం ఈ పాటని హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో తెరకెక్కిస్తున్నారు.
ఈ పాటలో రెబా మోనికా జాన్ స్టెప్పులు వేస్తోంది. `సామజవరగమన` సినిమాలో కథానాయికగా పరిచయం అయ్యింది రెబా. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రెబాకు అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఐటెమ్ గాళ్ గానూ అవతారం ఎత్తింది. ఫిబ్రవరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ వస్తోంది. బహుశా అదే టైమ్ కి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. తండేల్ పెద్ద సినిమా అయినా సరే, నిర్మాత నాగ వంశీ రిస్క్ చేసి మరీ..MAD 2 రిలీజ్ చేయబోతున్నార్ట. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఓ కొత్త అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.