దేశమంతా సుడిగాలి ప్రమోషన్లు చేస్తోంది పుష్ప టీమ్. పాట్నా, చెన్నై, కొచ్చిలలో జరిపిన ఈవెంట్లకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ముంబైలో మకాం వేసింది పుష్ప బృందం. అయితే తెలుగు నాట ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడం కాస్త నిరాశ కలిగిస్తోంది. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ఉండబోతోంది. డిసెంబరు 1న ప్రీ రిలీజ్ ఫంక్షన్ మల్లారెడ్డి కాలేజీలో జరిపే అవకాశం ఉంది. అయితే.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో మాత్రం ఈసారి ఈవెంట్ ఉండకపోవొచ్చని టాక్. డిసెంబరు 1న హైదరాబాద్ ఈవెంట్ తరవాత.. పుష్ప టీమ్ ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తుంది. దాంతో.. ప్రమోషన్లకు పుల్ స్టాప్ పడిపోతుంది. ఏపీలో ఈవెంట్ నిర్వహించాలని నిర్మాతలకు ఉన్నా, ఇప్పుడు కుదరకపోవొచ్చని టాక్. ఈవెంట్ ఎక్కడ నిర్వహించాలి? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడం, అనుమతులు రావడం కాస్త క్లిష్టంగా మారే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఏపీలో ప్రమోషన్ల గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ విశాఖపట్నంలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించొచ్చు. కాకపోతే.. పబ్లిక్ ఈవెంట్ లాంటివి ఉండకపోవొచ్చు. పుష్ప 2 సక్సెస్ మీట్ మాత్రం ఏపీలో భారీగా చేసే అవకాశం ఉంది.
సుకుమార్ ఇప్పటి వరకూ జరిగిన ఈవెంట్లకు హాజరు కాకపోవడం కాస్త నిరాశ కలిగించే విషయం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఆయనకు ఏమాత్రం కుదర్లేదు. అయితే హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ కు ఆయన హాజరవుతారు. అదే రోజున ‘పీలింగ్స్’ పాటని విడుదల చేయనున్నారు. విడుదలకు ముందే మరో ట్రైలర్ బయటకు వదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రఫ్ కట్ గా ఓ ట్రైలర్ సిద్ధంగా ఉంది. దానికి తుది మెరుగులు దిద్ది వదిలితే చాలు. మరి సుకుమార్ ఆలోచన ఎలా ఉందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన బజ్ వచ్చేసింది. కొత్తగా ట్రైలర్ వదలడం వల్ల ఒరిగేదేం ఉండదు. కాబట్టి… ఈ విషయంలో సుకుమార్ తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది.