జననాయగన్ విడుదల కాక, కరూర్ తొక్కిసలాట ఘటన కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయ్‌కు మరో షాక్ తగిలింది. ఐటీ శాఖ విధించిన కోటిన్నర జరిమానా చెల్లించాల్సిందేనని తమిళనాడు హైకోర్టు స్పష్టం చేసింది. 2015-16 అసెస్మెంట్ కాలానికి సంబంధించి తన అసలు ఆదాయాన్ని వెల్లడించలేదన్న ఆరోపణలతో ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.5 కోట్ల జరిమానాను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది.
ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసును సవాలు చేస్తూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి తిరస్కరించారు. ఈ మేరకు శాఖ జారీ చేసిన జరిమానా ఉత్తర్వులు చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేస్తూ ఈ తీర్పును వెలువరించింది. విజయ్ వాదన ప్రకారం, ఆయన 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 35.42 కోట్ల ఆదాయాన్ని ప్రకటించారు. అయితే, 2015లో ఆయన నివాసంలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా పులి’ సినిమా ద్వారా వచ్చిన రూ. 15 కోట్ల ఆదాయాన్ని ఆయన వెల్లడించలేదని అధికారులు గుర్తించారు.
ఈ ఆధారాల మేరకు ఆదాయపు పన్ను 2022 జూన్‌లో విజయ్‌కు రూ. 1.5 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన సింగిల్ జడ్జి బెంచ్, ఆగస్టు 16, 2022న ఆ జరిమానా అమలుపై మధ్యంతర స్టే విధించింది. అయితే ఇప్పుడు ఆయన పిటిషన్ ను కొట్టివేయడంతో ఆదాయపు పన్ను కట్టాల్సి వస్తోంది. ఆయన పన్ను ఎగ్గొట్టినట్లుగా నిర్దారణ అయినట్లయింది.


