మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయారు. ఆయన చనిపోయేవరకూ ఆయన కుటుంబం గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. గుట్టుగానే, గౌరవంగానే తన కుటుంబాన్ని ఉంచుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబం రాజకీయ ఆటలో పావులు మారింది. రాజకీయం కోసం పార్టీలు వారి కుటుంబసభ్యులను రోడ్డు మీదకు లాగుతున్నాయి. ఫలితంగా అందరిలోనూ ఆ కుటుంబ వ్యవహారాలే చర్చనీయాంశమవుతున్నాయి.
గోపినాథ్ మరణంపై ఫిర్యాదు చేసిన తల్లి
గోపీనాథ్ మరణంపై దర్యాప్తు చేయాలని ఆయన తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ చనిపోయి దాదాపుగా ఆరు నెలలు అవుతోంది. ఎన్నికల పోలింగ్ దగ్గర పడే వరకూ ఆమెకు ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదో కానీ.. ఇప్పుడు ఇలా ఫిర్యాదు చేయడానికి కారణం మాత్రం రాజకీయం అనుకోవచ్చు. గోపీనాథ్ సుదీర్ఘ కాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ఆ విషయం తల్లికి తెలియకుండా ఉండదు. మరి మరణంపై దర్యాప్తు చేయాలని ఎందుకు కోరుతున్నారో రాజకీయాలకు బాగా అర్థమైపోతుంది.
కుటుంబ వ్యవహారం లోకి రాజకీయాలు రాకూడదు !
గోపీనాథ్ చనిపోయేవరకు ఆయనకు మొదటి భార్య ఉందని ఎవరికీ తెలియదు. చనిపోయిన తర్వాత కూడా ఎవరికీ తెలియదు. చనిపోయినప్పుడు చూసేందుకు కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం వచ్చి తమను బెదిరించారని అంటున్నారు. తన తల్లే లీగల్ వైఫ్ అని.. తానే లీగల్ వారసుడ్ననని ప్రద్యుమ్న తారక్ అనే యువకుడు వాదిస్తున్నారు. పత్రాలు ఉన్నాయంటున్నారు. కానీ మాగంటి సునీతను గోపీనాథ్.. దాదాపుగా మూడు దశాబ్దాల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతా తెలిసి కూడా.. చనిపోయేవరకూ మాగంటి గోపీనాథ్ ను ఎందుకు వారు నిలదీయలేదు. లీగల్ గా కాకుండా.. పెద్ద మనుషుల పంచాయతీ ద్వారా వారు విడిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు లీగల్ ప్రాసెస్ నే చూపించి వివాదం చేస్తున్నారు.
ఆస్తులొస్తాయని ఆ కుటుంబాన్ని ఆశపెట్టారా?
గోపీనాథ్ కు ఉన్న ఆస్తుల్లో లీగల్ వారసుడిగా అన్నీ నీకే వస్తాయని ఎవరైనా ఆశపెట్టి … ఎప్పుడో దూరం అయిన కుటుంబాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. లీగల్ హెయిర్ గా గుర్తిస్తే ఆటోమేటిక్ గా వస్తాయి. అందుకే మాగంటిసునీత, వారి పిల్లలకు అన్యాయం చేసి ఆస్తులను లాగేసుకునే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని అనుకోవచ్చు. ఏది ఏమైనా .. ఎన్నికల ఫలితాల తర్వాత వీరి కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోరు. అప్పుడే తాము రాజకీయకుట్రలో భాగమయ్యామని వారికి తెలిసివస్తుంది.
