జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును ఆ పార్టీ పార్కటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత కే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా కేసీఆర్ ఎంపిక చేశారని బీఆర్ఎస్ తెలిపింది. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ, జూబ్లీ హిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
స్పెక్యులేషన్ కు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థిని ఖరారు చేశారు. సానుభూతి అస్త్రంతో పాటు కీలక సామాజికవర్గం అండ ముఖ్యమని కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలంతా నిర్ణయించుకున్నారు. పార్టీ తరపున నిర్వహించిన సర్వేల్లోనూ ఎక్కువ మంది మాగంటి కుటుంబానికి చాన్స్ ఇస్తేనే మంచిదని భావించారు. చివరికి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మాగంటి గోపీనాథ్ మొదటిసారి టీడీపీ, తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ తరపున గెలిచారు. ఉపఎన్నికలో ఆయన సతీమణి పోటీ పడుతున్నారు.
ఉపఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకం. తాము రికవరీ అవుతున్నామని.. మళ్లీ ప్రజాభిమానాన్ని పొందుతున్నామని నిరూపించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికే ఓ సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ లో పరాజయం పాలయ్యారు. అక్కడ మూడో స్థానంలోనిలిచారు. జూబ్లిహిల్స్ కూడా సిట్టింగ్ సీటే. నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ కూడా కంటోన్మెంట్ లాంటి ఫలితాలను వస్తే పార్టీ క్యాడర్ కు నైతికంగా ధైర్యం తగ్గిపోతుంది. అందుకే కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.