రివ్యూ : శుభ్ర‌మైన వినోదం ‘మ‌హానుభావుడు’

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

ప్రేక్ష‌కులు చాలా మంచోళ్లు.
వాళ్ల‌కి భారీ బ‌డ్జెట్ సినిమాలు అవ‌స‌రం లేదు.
స్టార్ల గార‌డీలు అక్క‌ర్లెద్దు.
విజువ‌ల్ ఎఫెక్ట్స్ గుమ్మ‌రించాల్సిన ప‌నిలేదు.

జ‌స్ట్.. స్వ‌చ్ఛ‌మైన వినోదం అందిస్తే చాలు. వంద రూపాయ‌ల టికెట్ కొంటే – కాసిన్ని న‌వ్వులు మూట‌గ‌ట్టుకొని వెళ్తే చాలు. కుటుంబం అంతా క‌లిసి సినిమా చూస్తున్న‌ప్పుడు ఒక్క‌సారి కూడా త‌లొంచుకొని, ఈ సీన్ గ‌డిచిపోతే బాగుణ్ణు అనుకోకుండా ఉంటే స‌రిపోతుంది.

మ‌రీ కొత్త కొత్త క‌థ‌లు అవ‌స‌రం లేదు. చిన్న కథే అయినా, అందంగా, చూడ‌గ‌లిగేలా ప్యాక్ చేసి ఇవ్వ‌గ‌లిగితే అదే ప‌ది వేలు. ఇక్క‌డ మారుతి అండ్ కో చేసింది కూడా అదే! చిన్న లైన్‌.. వెరైటీ క్యారెక్ట‌రైజేష‌న్‌.. కొన్ని న‌వ్వులు అదే మ‌హానుభావుడు!!

* క‌థలోకెళ్తే….

మ‌హానుభావుడు టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసిన‌వాళ్ల‌కు క‌థ మ‌రోసారి చెప్పాల్సిన ప‌నిలేదు. అన‌గ‌న‌గా ఓ అబ్బాయి. అత‌ని పేరు ఆనంద్‌. త‌న‌కి ఓసీడీ ఉంది. అంటే అతి ప‌రిశుభ్ర‌త అన్న‌మాట‌. టాబ్లెట్‌ని కూడా నీటిలో క‌డిగి ఆ త‌ర‌వాత వేసుకొనే స్వ‌భావం. అంత‌కు మించిన శుభ్ర‌త ఏముంటుంది..?? బ్రెడ్ అయినా స‌రే.. ఊదుకొని, నాప్‌కిన్‌తో తుడుచుకొని మ‌రీ తింటాడు. అదో తుత్తి. ఈ అతి శుభ్ర‌త త‌న‌తో స‌రిపెట్టుకోడు. ప‌క్క‌వాళ్లు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. ఎవ‌రైనా తుమ్మితే ఆమ‌డ‌దూరం పారిపోతాడు. ఎవ‌రైనా షేక్ హ్యాండ్ ఇవ్వాల‌నుకొంటే.. చేతిని డెటాల్‌తో క‌డిగి మ‌రీ ఇస్తాడు. ఇంత‌టి శుభ్ర‌మైన కుర్రాడు… ప‌ల్లెటూరు వెళ్లాల్సివ‌స్తుంది. ఓ అమ్మాయి ప్రేమ కోసం మురికిని, దుమ్ముని, మ‌ట్టిని ప్రేమించాల్సివ‌స్తుంది. ఇదంతా ఎందుకు చేశాడు?? చివ‌రికి ఏం సాధించాడు?? త‌న అతి శుభ్ర‌త జాడ్యం వ‌దిలించుకొన్నాడా, లేదా?? అనేదే సినిమా.

* విశ్లేష‌ణ‌

ఇలాంటి పాయింట్లు షార్ట్ ఫిల్మ్స్‌కి భ‌లే బాగుంటాయి. ప‌ది నిమిషాల్లో ముగిసిపోతాయి కాబ‌ట్టి.. చెప్పాల్సిన పాయింట్ ఒక్క‌టీ చెప్పి సంతృప్తి ప‌డిపోవొచ్చు. కానీ సినిమా అలా కాదు. రెండున్న‌ర గంట‌లు న‌డ‌పాలి. అక్క‌డే ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం తెలిసొస్తుంది. మ‌తిమ‌రుపు అనే పాయింట్ చుట్టూ ఓ ప్రేమ‌క‌థ‌ని న‌డిపి స‌క్సెస్ కొట్టాడు మారుతి. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఈ ఓసీడీ పాయింట్‌నీ సినిమాగా మ‌ల‌చ‌డానికి రంగంలోకి దిగిపోయి ఉంటాడు. ఓ చిన్న పాయింట్‌ని రెండు గంట‌లు లాగి, న‌వ్వించి, ఒప్పించి, ఓకే అనిపించుకోవ‌డంలోనే మారుతి స‌గం స‌క్సెస్ కొట్టేసిన‌ట్టు.

ఈ సినిమాకి బ‌లం.. కొత్త‌ద‌నం అనుకొనే అంశం… ఓసీడీ మాత్ర‌మే! దాని వ‌దిలి బ‌య‌ట‌కు రాకూడ‌దు. ఏం చెప్పినా దాని చుట్టూనే చెప్పాలి. నిజానికి ఇది చాలా క‌ష్ట‌మైన విష‌యం. దాన్ని చాలా ఈజీగా దాటేశాడు మారుతి. క‌థానాయ‌కుడి కోణంలోనే క‌థ‌ని చెబుతూ తెలివైన ప‌ని చేశాడు. వీలైన ప్ర‌తీ చోటా ఓసీడీని మొహ‌మాట ప‌డ‌కుండా వాడుకొన్నాడు. ఉదాహ‌ర‌ణ‌కు న‌ల్ల‌వేణు సీను.దాన్ని హిలేరియ‌స్‌గా పండించాడు. హోటెల్‌లో నాజ‌ర్ భోజ‌నం చేస్తున్న‌ప్పుడు శ‌ర్వానంద్ న‌ట‌న కాస్త ఓవ‌ర్‌గా అనిపించినా… అక్క‌డా కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యింది. దొంగలెత్తుకెళ్లిన బ్యాగ్‌ని హీరో తిరిగి తీసుకురావ‌డం… అక్క‌డ కూడా అతి శుభ్ర‌త అనే పాయింట్‌ని వాడుకోవ‌డం మారుతి తెలివితేట‌ల‌కు నిద‌ర్శ‌నం.

క‌థ ఊరికెళ్లాక ఏం జ‌రుగుతుందో ఈజీగా ఊహించొచ్చు. అయితే అక్క‌డ ఆవ‌కాయ్ ముద్ద‌ల సీన్‌, స్నానాల స‌న్నివేశం ఇవ‌న్నీ బాగా పండాయి. రొటీన్ స‌న్నివేశ‌మైనా స‌రే.. కామెడీ మిక్స్ చేసి బోర్ కొట్ట‌కుండా చూసుకొన్నాడు మారుతి. అయితే ప్రీ క్లైమాక్స్. క్లైమాక్స్ బాగా వీకైపోయాయి. కుస్తీ పోటీల్లో హీరో దిగ‌డం, అక్క‌డ విల‌న్‌ని తుక్కుతుక్కు చేయ‌డం బీసీ నాటి ఫార్ములా. ఆనంద్‌ని మేఘ‌న బ్లాక్ మెయిల్ చేసి పంపుతుంది అంతే. ఆనంద్ త‌న‌కు తాను మారి.. త‌న త‌ప్పు తెలుసుకొని ఫైట్ చేయ‌డు. హీరో మారాడా, లేదా?? మారితే ఎందుకోసం అనేది పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్. మ‌ట్టిని, మురికిగా ఉంటే అమ్మ‌ని సైతం అస‌హ్యించుకొనే వ్య‌క్తి మారాడంటే బ‌ల‌మైన ఎమోష‌న్‌ని జోడించాలి. చిన్న‌ప్ప‌టి నుంచీ అల‌వాటైపోయిన ఓ రోగం కుద‌రాలంటే.. అంత‌కు మించిన అల‌జ‌డి ఏదో క‌ల‌గాలి. దాన్ని సృష్టించ‌డంలో మారుతి విఫ‌ల‌మ‌య్యాడు. గుండెని తాకే ఓ స‌న్నివేశంతో క‌థానాయ‌కుడిలో మార్పు వ‌చ్చింద‌ని చూపిస్తే.. ఈ సినిమా స్థాయి మ‌రోలా ఉండేది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

వినోదానికి స్కోప్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకొంటున్న‌ప్ప‌టి నుంచీ శ‌ర్వా స‌క్సెస్ రేటు బాగుంది. ఈసారీ త‌న కామెడీ టైమింగ్‌ని అద్భుతంగా ప‌లికించాడు. ఆనంద్ లాంటి మ‌నిషిని, అలాంటి క్యారెక్ట‌ర్‌ని బ‌య‌ట మ‌నం చూడం. అలాంటివాడు ఉంటాడంటే న‌మ్మం. అయితే శ‌ర్వాని చూస్తే… నిజంగా ఇలాంటివాళ్లుంటారేమో అనిపిస్తుంది. ఎమోష‌న్‌ని క్యారీ చేయ‌గ‌ల న‌టుడు శ‌ర్వా. అయితే ఆ యాంగిల్‌ని ద‌ర్శ‌కుడు స‌రిగా వాడుకోలేదు. మెహ‌రీన్ త‌న పాత్ర‌కు త‌గిన న్యాయం చేసింది. అందంగా ఉంది. న‌టించాల్సిన సన్నివేశాలు ప‌డిన‌ప్పుడు నిల‌బ‌డ‌గ‌లిగింది. నాజ‌ర్ మ‌రో సారి నాన్న పాత్ర‌లో ఇమిడిపోయాడు. శ‌ర్వా త‌ర‌వాత ఎక్కువ న‌వ్వించింది వెన్నెల కిషోరే.

* సాంకేతిక వ‌ర్గం

త‌మ‌న్ ట్యూనింగ్ ఈ సినిమాతో కాస్త మారిన‌ట్టు అనిపించింది. మెలోడీలు ఆక‌ట్టుకొన్నాయి. మ‌హానుభావుడ‌వేరా.. హ‌మ్ చేసుకొనేలా సాగింది. ఆ పాట‌ని ఆర్‌.ఆర్ లో బాగానే వాడుకొన్నాడు త‌మ‌న్‌. సినిమా చాలా రిచ్‌గా ఉంది. మారుతి మంచి క‌థ‌కుడు. ర‌చ‌యిత‌. ఆ రెండూ ద‌ర్శ‌కుడికి బాగా హెల్ప్ చేశాయి. కథ‌ని చెప్పిన విధానం, చిన్న పాయింట్‌తో రెండు గంట‌లు కూర్చోబెట్టిన ప‌ద్ధ‌తి ఆక‌ట్టుకొంటాయి. ఎమోష‌న్ సీన్లు రాసుకోగ‌ల నేర్పు ఉండి, ఈ క‌థ‌లో అందుకు స్కోప్ ఉండి, అవి పండించ‌గ‌ల న‌టుడు ఉండి.. ఎందుకో దాన్ని విస్మ‌రించాడు మారుతి.

* ఫైన‌ల్ ట‌చ్ : మ‌’హా..హా’ను భావుడు

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.