మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతిలో ప్రమాదానికి గురైంది. జడ్పీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన బారామతిలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లి మంటలు చెలరేగడంతో ఈ భయానక ప్రమాదం సంభవించింది.
ప్రమాదానికి గురైన విమానం లియర్ జెట్ 45 . ఇది ముంబై నుంచి వచ్చింది. ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో విమానం నియంత్రణ కోల్పోయి రన్‌వే దాటి వెళ్లగానే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో భారీగా మంటలు ఎగసిపడటంతో అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటన చేసింది. ఐదుగురు విమానంలో ఉన్నారని అందరూ చనిపోయారని డీజీసీఏ తెలిపింది. ఈ విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో దాదా గా సుపరిచితులు. సుదీర్ఘ కాలం పాటు మహారాష్ట్రకు నీటిపారుదల, ఆర్థిక శాఖల మంత్రిగా , పలుమార్లు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. 2023లో తన బాబాయ్ శరద్ పవార్‌తో విభేదించి, ఎన్సీపీలో చీలిక తెచ్చి బీజేపీ-శివసేన (షిండే వర్గం) కూటమి ప్రభుత్వంలో చేరడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన శరద్ పవార్‌తో కలిసిపోయినట్లుగా ప్రకటించారు.
