మహారాష్ట్ర ప్రభుత్వం మత మార్పిళ్ల నిరోధానికి కీలక నిర్ణయం తీసుకుంది. మత మార్పిడి నిరోధక బిల్లు ముసాయిదాకు ఆమోదం తెలిపింది. బలవంతపు, మోసపూరిత , ప్రలోభాలకు గురిచేసి చేసే మత మార్పిడులను అరికట్టడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం, ఎవరైనా మతం మారాలనుకుంటే కనీసం 60 రోజుల ముందే సంబంధిత అధికారులకు నోటీసు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. అలాగే, మత మార్పిడి జరిగిన 25 రోజుల్లోపు దానిని రిజిస్టర్ చేయించుకోవాలి, లేనిపక్షంలో ఆ మార్పిడి చెల్లుబాటు కాదు.
ఈ బిల్లులో శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. మత మార్పిడి నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 7 ఏళ్ల జైలు శి, రూ. 1 లక్ష జరిమానా విధించాలని ప్రతిపాదించారు. ఒకవేళ మైనర్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిని అక్రమంగా మత మార్పిడి చేస్తే, శిక్ష 7 ఏళ్ల జైలుతో పాటు జరిమానా రూ. 5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు నాన్-బెయిలబుల్ గా పరిగణిస్తారు.
కేవలం పెళ్లి కోసం మాత్రమే చేసే మత మార్పిడులను అరికట్టేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. ఎవరైనా రక్త సంబంధీకులు అక్రమ మత మార్పిడిపై ఫిర్యాదు చేస్తే, పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా లవ్ జిహాద్ ను అరికట్టడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో ఇలాంటి బిల్లులకు ఇప్పటికే ఆమోదం లభించింది.

