మహేష్ బాబు – రాజమౌళి సినిమా పేరు ‘వారణాసి’ అనే గాసిప్ బయటకు రాగానే ఓ చిన్న నిర్మాత ‘వారణాసి’ అనే టైటిల్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఫిల్మ్ ఛాంబర్ లో ఆ పేరుతో ఇది వరకే టైటిల్ రిజిస్టర్ చేయించేశారు. కాబట్టి రాజమౌళి మరో పేరు ఎంచుకోవాల్సిందే అంటూ ప్రచారం జరిగింది. అయితే రాజమౌళి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తన సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, దాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. సో.. ఇప్పుడు ‘వారణాసి’ అంటే మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్. అయితే… ఇది వరకే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించిన సుబ్బారెడ్డి అనే నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ లో గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దాంతో ఈ టైటిల్ పై రగడ మొదలైంది.
ఏదైనా ఓ సినిమా టైటిల్ ప్రకటించే విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకొంటారు. పెద్ద ప్రాజెక్టుల విషయంలో అది ఇంకా ముఖ్యం. కథకు తగ్గట్టుగా ఓ టైటిల్ అనుకొని, ఆ టైటిల్ అందుబాటులో ఉందా, లేదా? వేరే ఎవరైనా రిజిస్టర్ చేయించుకొన్నారా అనే విషయాలు ఆరా తీస్తారు. కానీ జక్కన్న తన టైటిల్ ని చాలా లైట్ తీసుకొన్నట్టు అర్థం అవుతోంది. అదే టైటిల్ తో ఓ సినిమా తయారవుతోంది, పోస్టర్ కూడా బయటకు వచ్చిందన్న సంగతి జక్కన్నకు తెలుసో.. లేదో అర్థం కావడం లేదు. కానీ ఛాంబర్ లో మాత్రం ‘ఈ టైటిల్ నాదే.. ఎవరికీ ఇవ్వలేదు’ అంటూ సుబ్బారెడ్డి నిర్మాత పంచాయితీ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సదరు నిర్మాతతో రాజమౌళి గానీ, తన టీమ్ లో మరెవరైనా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఏర్పడింది. రాజమౌళి లాంటి బడా దర్శకుడు అడిగితే టైటిల్ ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదు. కావాలంటే దానికి సంబంధించిన రాయల్టీ రాజమౌళి చెల్లించగలడు కూడా. కానీ… నిర్మాత ససేమీరా అంటే.. అప్పటి పరిస్థితి ఏమిటన్నది ఆలోచించుకోవాలి.