హైదరాబాద్: ఇప్పుడున్న ట్రెండ్‌లో నంబర్ వన్ ఎవ్వరూ లేరని ప్రిన్స్ మహేష్ బాబు అన్నారు. సినిమా అన్నది స్టార్స్‌కంటే పెద్దదయిందని, ప్రతి శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చే సినిమానే స్టార్ అని మహేష్ వ్యాఖ్యానించారు. శ్రీమంతుడు విడుదల సందర్భంగా ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరీ చెప్పాలంటే ఇప్పుడు పరిశ్రమలో నంబర్ వన్ ఎవరంటే రాజమౌళి పేరే చెబుతానని అన్నారు. ఆయన చేసిన సినిమాలు అలాంటివని చెప్పారు. రాబోయే చిత్రం బ్రహ్మోత్సవం గురించి చెబుతూ, అది ఒక పండగలాగా ఉంటుందని అన్నారు. ఆ చిత్ర దర్శకుడు తన అభిమాన దర్శకుడని చెప్పారు. ఆయన సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయని అన్నారు. కథ బాగుంటే పవన్, ఎన్టీఆర్, నాగార్జునవంటి స్టార్లతో పనిచేయటానికి తాను సిద్ధమేనని చెప్పారు.
హీరోగా పరిచయమైన కొత్తల్లో ఒక ఇంటర్వ్యూలో నంబర్ వన్ స్థానం గురించి అభిప్రాయమడిగితే – 1 నుంచి 10వరకూ అన్నీ చిరంజీవే అని, ఆయనే తెలుగులో ఆఖరి నంబర్ 1 అని చెప్పిన మహేష్, ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లుంది. అభిప్రాయాలు మారటం సహజమే.
మరోవైపు ఇవాళ విడుదలైన శ్రీమంతుడు చిత్రం మొదటి ఆటనుంచే మంచి టాక్ తెచ్చుకుంది. దీనితో మహేష్ సంబరపడిపోతున్నారు. తన జీవితంలోని అత్యంత సంతోషకరమైనరోజులలో ఇవాళ ఒకటని ట్వీట్ చేశారు. 1-నేనొక్కడినే, ఆగడు చిత్రాలు పరాజయంపాలైన తర్వాత వచ్చిన శ్రీమంతుడు చిత్రం విజయంకావటంతో మహేష్ బాగా ఆనందిస్తున్నట్లు కనబడుతోంది.