రేవంత్ రెడ్డి, మల్లారెడ్డికి మధ్య ఓ పోటీ మొదటి నుంచి ఉంది. అయితే రేవంత్ ఎక్కడికో వెళ్లిపోయారు..కానీ మల్లారెడ్డి మాత్రం అక్కడే ఉండిపోయారు. రేవంత్ పై మల్లారెడ్డి ఒంటికాలితో లేచేవారు. తొడలు కొట్టారు. బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం.. రేవంత్ ను గెలిపించింది తానేనని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ లాబీలో కొత్తగా ఆయన రేవంత్ ను గెలిపించింది తానేని చెప్పుకుంటున్నారు.
అసెంబ్లీ లాబీల్లో మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నాకు మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. ఆయన్ని నేనే ముఖ్యమంత్రిని చేశాను. ఎవరు ఏమనుకున్నా మేమిద్దరం అన్నదమ్ములమేనని చెప్పుకొచ్చారు. గతంలో తామిద్దరం కలిసి టీడీపీలో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ, రేవంత్ రెడ్డి ఎదుగుదలలో తన వంతు పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
రెడ్డి సామాజిక వర్గంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమేనని మల్లారెడ్డి చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాను గతంలో జరిగిన రెడ్డి సంఘం సమావేశంలో కూడా కుండబద్దలు కొట్టినట్లు గుర్తు చేశారు. ఆనాడు తాను రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడినప్పుడు కొందరు అడ్డుకున్నా, తాను మాత్రం వెనక్కి తగ్గలేదని చెప్పారు. సామాజిక వర్గం పరంగా చూసినా, రాజకీయంగా చూసినా రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నారని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
నిజానికి మల్లారెడ్డి.. రేవంత్ తో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటున్నారు కానీ..టీడీపీలో రేవంత్ కు రావాల్సిన మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ నుంచి మల్లారెడ్డి తీసుకున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఎప్పుడూ సఖ్యత లేదు. కానీ రేవంత్ సీఎం కావడంతో .. మల్లారెడ్డికి ప్లేట్ ఫిరాయించక తప్పడంలేదు.


