బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్దగా కనిపించని మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు బండి సంజయ్ తో పరిచయాలు పెంచుకుంటోంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చురుకుగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమెకు చాలా రాజకీయ ఆసక్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తానే పోటీ చేస్తానని ఓ సందర్భంలో ఆమె అన్నట్లుగా ప్రచారం జరిగింది.
ఇలాంటి సమయంలో ప్రీతిరెడ్డి బండి సంజయ్ ద్వారా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. బోనాల వేడుకల సందర్భంగా బండి సంజయ్ ను ఆహ్వానిస్తూ , శుభాకాంక్షలు చెబుతూ పాతబస్తీలో చాలా మంది ఫ్లెక్సీలు పెట్టారు. అందరూ బీజేపీ నేతలే. కానీ బీజేపీలో లేకపోయినా ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు. అంతే కాదు.. బండి సంజయ్ కు విందు కూడా ఇచ్చారు. ఈ విందు భేటీ దృశ్యాలు వైరల్ గా మారాయి.
మల్లారెడ్డి అనుమతి లేకుండా ప్రీతిరెడ్డి ఇలా బీజేపీ నేతలతో పరిచయాలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారని ఎవరూ అనుకోవడం లేదు. బీజేపీలో చేరే ఉద్దేశంతోనే మల్లారెడ్డి కుటుంబం మెల్లగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోందని అంటున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరినా ఆశ్చర్యం ఉండదని చెబుతున్నారు.