అనేక అవకతవకలు, భూకబ్జాలు, దందాలు నెత్తి మీద పెట్టుకుని అధికారం ఉంది కదా అని.. ఓవరాక్షన్ చేస్తే… ఏమవుతుంది ?. మల్లారెడ్డి లాగే గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. గత ఐదేళ్లుగా మల్లారెడ్డి చేసిన అతికి ఇప్పుడు ఆయన మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం మారగానే ఆయన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి. కక్ష సాధింపు అని డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా లభించడం లేదు.
మల్లారెడ్డి కాలేజీల విషయంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన అల్లుడు కూడా అదే బాపదు. ఏకంగా పదిహేను ఎకరాల చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేశారు. వాటిని బీఆర్ఎస్ హయాంలోనూ రెగ్యులరైజ్ చేసుకోలేకపోయారు. ఎల్ఆర్ఎస్ కట్టామని చెబుతున్నారు. ఇలాంటి చాన్స్ వస్తే కూల్చివేతలు చేయకుండా ఉంటారా ?. అయితే ఇది ప్రారంభమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా చాలా సినిమా ఉందని కాంగ్రెస్ వర్గాలు లీకులిస్తూనే ఉన్నాయి.
అందుకే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత వద్దకు లాబీయింగ్ కు కూడా వెళ్లారు. అయినా ప్రయోజనం లభించలేదని చెబుతున్నారు. ఈ కూల్చివేతలపై మల్లారెడ్డి మీడియా ముందుకు రాలేదు. ఈ సమయంలో తాను ఏం మాట్లాడినా అది రివర్స్ అవుతుందని తెలుసు. అందుకే కక్ష సాధింపులని చెప్పడానికి కూడా ఆయన భయపడుతున్నారు.
గతంలో రేవంత్ రెడ్డి మీద అనుచిత భాషను ప్రయోగించేవారు. తొడకొట్టేవారు. రేవంత్ ను బ్లాక్ మెయిలర్ అనేవారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం అనుకుని రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుందని మల్లారెడ్డి ఉదంతం మరోసారి నిరూపిస్తోంది.