మల్కాజ్ గిరి టికెట్. పార్టీ ఏదైనా ఇది హాట్ సీట్. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతున్న టికెట్ ఇది. అయితే, మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని రెండు అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సహకరిస్తే గెలుపు పక్కా అని బీఆర్ఎస్ లో నమ్మకం. పైగా ఆర్థికంగానూ వారి సపోర్ట్ కావాల్సిందే. గతంలో మల్లారెడ్డి ఓసారి ఎంపీగా ఇక్కడి నుండి పోటీ చేయగా, ఆయన అల్లుడు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
అంటే… మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలో మల్లారెడ్డి ఫ్యామిలీకి మంచి పట్టుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని బరిలో నింపాలని ఫిక్స్ అయ్యింది. మొన్నటి వరకు తండ్రి చాటు నాయకుడిగా ఉన్న భద్రారెడ్డి పేరు ఫిక్స్ కావటంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. అండర్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది.
కట్ చేస్తే, మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై ఉన్న భూకబ్జా, చెరువుల కబ్జా ఆరోపణలపై చర్యలు మొదలయ్యాయి. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలు చెరువులను కబ్జా చేసి బిల్డింగ్ లు కట్టుకున్నారని అధికారులు కూల్చివేతలకు దిగటంతో మల్లారెడ్డి ఫ్యామిలీ ఉలిక్కిపడింది. ప్రభుత్వంతో సయోధ్యకు ప్రయత్నించినా ఫలించలేదు. అవసరం అయితే కాంగ్రెస్ లో చేరతాం అని కూడా సిగ్నల్స్ పంపారు.
దీంతో అప్రమత్తమైన కేసీఆర్… మల్లారెడ్డిని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉండాలని… ప్రభుత్వం చర్యలపై న్యాయపరంగా వెళ్దామని, పార్టీ మద్దతుంటుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే ససేమిరా పార్టీలో ఉండేందుకు ఒప్పుకున్న మల్లారెడ్డి ఫ్యామిలీ, బీఆర్ఎస్ నుండి ఆయన కొడుకును మాత్రం పోటీ నుండి తప్పించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఎన్నికల్లో పోటీ చేయలేమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
మల్లారెడ్డి ఫ్యామిలీ బరి నుండి తప్పుకోవటంతో బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. దీంతో, కేసీఆర్ ఇప్పుడు మరో అభ్యర్థి వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.