సవాళ్లు, డైలాగులతో సందడిగా రాజకీయం చేసే మల్లారెడ్డి జావకారిపోయారు. తాను ఇక రాజకీయాల్లో లేనని అంటున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా పదవి ఉన్న మూడేళ్లు మాత్రమే రాజకీయంలో ఉంటానని తర్వాత రిటైరైపోతానని అంటున్నారు. మరి ఈ మూడేళ్లు బీఆర్ఎస్ తరపునే రాజకీయం చేస్తారా అంటే.. అలాంటిదేమీ లేదంటున్నారు. తాను బీఆర్ఎస్ వైపా.. టీడీపీ వైపా..బీజేపీ వైపా అన్నది కాదని ఇక తనకు రాజకీయాలు అవసరం లేదని అంటున్నారు.
ఇటీవలి కాలంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారా.. పార్టీ ఆయనను దూరంగా ఉంచుతోందా అన్నది స్పష్టత లేదు. కానీ కేసీఆర్ తో జరిగే సమావేశాలకు మాత్రం ఆయనకు ఆహ్వానం అందడం లేదు. ఆయన కోడలు ప్రీతిరెడ్డి బండి సంజయ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బండి సంజయ్ కోసం ఫ్లెక్సీలు పెడుతున్నారు. దాంతో ఆ కుటుంబం బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది.
బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికలను టార్గెట్ చేసి ఉంటే.. వీరు ఈ లోపే బీజేపీలో చేరిపోయే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి తాను బీఆర్ఎస్ తరపున రాజకీయాలు చేయాలనుకోవడం లేదని పరోక్షంగా చెప్పడం ఆసక్తికరంగా మారింది.