ఈడీ దాడులు చేస్తుంది. కానీ ఈడీపై ఎవరైనా దాడులు చేస్తారా?. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేస్తారు. అలా దాడులు చేయడమే కాదు..కీలక ఫైళ్లను దర్జాగా తీసుకెళ్లిపోతారు. అచ్చంగా కోల్ కతాలో ఇదే జరిగింది.
బెంగాల్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అధికార పార్టీ టీఎంసీకు ఐ ప్యాక్ వ్యూహకర్తగా సేవలు అందిస్తోంది. ఈ ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్ కు చెందినది కాదు. హఠాత్తుగా ఐ ప్యాక్ ను లీడ్ చేస్తున్న వ్యక్తి ఇంట్లో ఈడీ సోదాలు ప్రారంభించింది. బొగ్గు స్కాంలో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంట్లో సోదాలు చేస్తున్నామని ఈడీ తెలిపింది. ఈడీ సోదాల గురించి తెలిసిన వెంటనే మమతా బెనర్జీ సీఎం నివాసం నుంచి హుటాహుటిన ఐ ప్యాక్ ఆఫీసుకు వచ్చారు. తన సిబ్బందితో ఆ ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి వెళ్లి కీలక ఫైల్స్ ను తీసుకెళ్లిపోయారు.
తమ పార్టీ రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల సమాచారాన్ని దొంగిలించేందుకు ఈడీ వచ్చిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ సమాచారాన్ని వారికి దొరకకుండా తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. అయితే ఈడీ మాత్రం తాము ఏ రాజకీయ సంస్థను లక్ష్యంగా చేసుకోలేదని.ఏ పార్టీ కార్యాలయంలోనూ సోదాలు జరగలేదని స్పష్టం చేసింది. బెంగాల్‌లోని ECL లీజు ప్రాంతాల నుండి బొగ్గును దొంగిలించి అక్రమంగా తవ్విన అనుప్ మజీ నేతృత్వంలోని బొగ్గు స్మగ్లింగ్ సిండికేట్‌కు సంబంధించిన ఇళ్లలోనే సోదాలు నిర్వహించామని ఈీడ తెలిపింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వచ్చే వరకు శాంతియుతంగా సోదాలు నిర్వహించారని.. కానీ ఆమె వచ్చి ఆధారాలు తొలగించారని ఈడీ ఆరోపించింది.
మమతా బెనర్జీ ఇలా చేయడంతో బెంగాల్ లో రాజకీయ దుమారం ప్రారంభమయింది. ఆమెపై ఈడీ కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
