తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామిని రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ఓ పార్టీ రాజ్యసభ సభ్యుల్ని ఎంపిక చేయడం పెద్ద విశేషం కాదు. కానీ దీదీ ఎంపిక మాత్రం ఎప్పుడు నేషనల్ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం మేనకా గురుస్వామి ప్రత్యేకతలే. ఎన్నో గొప్ప కేసులు వాదించడమే కాదు.. తాను స్వయంగా స్వలింగ సంపర్కురాలినని ధైర్యంగా ప్రకటించుకున్నారు.
ఎవరీ మేనకా గురుస్వామి?
మేనకా గురుస్వామి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులలో ఒకరు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన ఆమె, రాజ్యాంగపరమైన అంశాల్లో తనదైన ముద్ర వేశారు. కేవలం న్యాయవాదిగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మేధావిగా ఆమెకు పేరుంది. 2019లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఆమెను చేర్చింది.
స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడిన లాయర్
మేనకా గురుస్వామి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది సెక్షన్ 377 రద్దు కోసం ఆమె చేసిన చట్టపరమైన పోరాటం. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాన్ని సవాలు చేస్తూ ఆమె వాదించిన తీరు న్యాయ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాల పిల్లలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కీలక పాత్ర పోషించారు. అధికారుల బదిలీలు, పదవీకాలం వంటి అంశాల్లో రాజకీయ జోక్యం తగ్గించేలా చట్టపరమైన పోరాటం చేశారు. రాజ్యసభకు ఎన్నికైతే, భారత పార్లమెంటులో బహిరంగంగా తన గుర్తింపును ప్రకటించుకున్న తొలి LGBTQ+ ప్రతినిధిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో మమతా బెనర్జీ ప్రత్యేక శైలి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఎప్పుడూ భిన్నమైన శైలిని అనుసరిస్తుంటారు. కేవలం రాజకీయ నేతలనే కాకుండా, వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిని పార్లమెంటుకు పంపడం ఆమె ఓ విధానంగా పెట్టుకున్నారు. మేనకా గురుస్వామి వంటి వారు చట్టసభల్లో అడుగుపెట్టడం వల్ల న్యాయపరమైన అంశాలు, పౌర హక్కుల పట్ల లోతైన చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా మమతా బెనర్జీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు మేధావి వర్గాన్ని, ఇటు సామాజిక హక్కుల పోరాట యోధులను ఆకట్టుకున్నారు. ఈ నిర్ణయంపై మేధావులు, న్యాయ నిపుణుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
