మమత మూడో ప్రత్యామ్నాయం!

దేశంలో బిజెపికి, కాంగ్రెస్ పార్టీలకు మూడవ రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబడటానికి నాయకుల మధ్య జరుగుతున్న పరోక్ష పోటీలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందడుగులు వేస్తున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ గుర్తింపు ఇవ్వడానికి సాంకేతిక లాంఛనాలు పూర్తయ్యాయి. ఇంతవరకూ కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, బిఎస్ పి, ఎన్ సి పి పార్టీలకు మాత్రమే ఈ గుర్తింపు వుండగా ఆగుర్తింపు పొందిన జాబితాలో ఏడవ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ కు చోటు దొరికింది.

ఏ రాజకీయపార్టీ అయినా మూడు కండిషన్లలో ఏదో ఒక కండిషన్ నెరవేర్చగలిగితే ఆపార్టీకి జాతీయ గుర్తింపు వస్తుంది. మొదటగా ఆ పార్టీ లోక్ సభ ఎన్నికలలో 2 శాతం ఓట్లతో కనీసం మూడు రాష్ట్రాలలో కలిపి 11 మంది లోక్ సభ సభ్యులు ఉండాలి. లేదా నాలుగు రాష్ట్రాలలో 6 శాతం చొప్పున ఓట్లు పొంది, నలుగురు లోక్ సభ సభ్యులు ఉండాలి. లేని పక్షంలో నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ మూడో నిబంధనను పూర్తి చేసుకుంది.

దీన్ని సాంకేతిక అంశంగా మాత్రమే కాక దేశ ప్రధాని పదవి వైపు దృష్టి పెట్టిన వారిలో మమతా బెనర్జీ ముందడుగుగా భావించవచ్చు. భారతదేశాన్ని పాలించడానికి పోటీ పడుతున్న వారిలో ప్రధానంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి తదితరులు ఉన్నారు. వీరు ముందుగా తమ పార్టీలకు జాతీయ స్థాయి హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

జాతీయస్థాయి రాజకీయాలలో, ముఖ్యంగా ప్రధాన మంత్రి పదవి పట్ల ఆసక్తి లేదని చెబుతున్నా గుంభనంగా తన ఎత్తుగడ లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ అమలు జరుపుతున్నారని స్పష్టం అవుతున్నది. ముందుగా ప్రాంతీయ పార్టీల సమాఖ్య ఏర్పాటు కోసం పలువురు ముఖ్యమంత్రుల మద్దతు సమీకరించుకోగలిగారు.

దానితో నరేంద్ మోడీ కి వ్యతిరేకంగా అటు కాంగ్రెస్ తో గాని, ఇటు వామపక్షాలతో గాని చేతులు కలపకుండా పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆమెతో చేతులు కలపడం కోసం సిద్దపడుతున్నారు. ఆమెతో మంచి సంబంధాల కోసం అటు కేజ్రీవాల్, ఇటు నితీష్ కుమార్ వంటి నేతలు కూడా సిద్ద పడుతూ ఉండటం గమనార్హం. తమ పార్టీలకు జాతీయ పార్టీ హోదా సంపాదించడం కోసం నితీష్ కుమార్, కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాలు ఒక దరికి చేరక ముందే మమతా బెనెర్జీ నాయకత్వంలోని త్రిణమూల్ కాంగ్రెస్ కు మాత్రం జాతీయ పార్టీ హోదా లభించింది. ఈమేరకు ఎన్నికల కమీషన్ నోటిపికేషన్ వెలువడటమే ఆలస్యం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com