ఇలా చేస్తే ఎలా నిత్య‌?

క‌థానాయిక‌ల‌పై కుసింత గౌర‌వం క‌లిగించింది నిత్య‌మీన‌న్‌. ఎక్స్‌పోజింగ్ చేయ‌దు, ఏ పాత్ర ప‌డితే ఆ పాత్ర ఒప్పుకోదు, హీరోల వెంట తిర‌గ‌దు, ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ యాక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకొంది. తెలుగు అమ్మాయి కాక‌పోయినా.. తెలుగు నేర్చుకొంది, తెలుగుల‌తోనే మాట్లాడుతుంది, తెలుగులో పాడుతుంది కూడా. క‌థ‌ల ఎంపిక‌లో నిత్యకు తిరుగులేద‌నుకొన్నారంతా. కానీ.. ఆ గుడ్ విల్ అంతా పోతోంది. వ‌రుస‌గా ప్రాధాన్యం లేని పాత్ర‌ల్ని ఎంచుకొంటూ నిత్య త‌న ఇమేజ్‌ని తానే త‌గ్గించుకొంటోంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో సెకండ్ హీరోయిన్ కంటే.. త‌క్కువ స్థాయి ఉన్న పాత్ర‌లో క‌నిపించింది. రుద్ర‌మ‌దేవిలోనూ నిత్య ఉంది… అంటే ఉంది.. అంతే. ఆమె పాత్ర‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు లేదు. ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్‌లోకూడా అంతే. ఏవో నాలుగు సన్నివేశాల్లో క‌నిపించి వెళ్లిపోయే స్థాయి కాదు… నిత్య‌ది. త‌న‌లోని టాలెంట్‌ని కాస్త‌యినా చూపించ‌లేన‌ప్పుడు ఇలాంటి పాత్ర‌ల్ని ఎందుకు ఎంచుకోవాలి అనిపిస్తోంది..? నిత్య కూడా మామూలు క‌థానాయిక‌ల్లా మారిపోతోందా..?? అనే డౌటు వ‌స్తోంది.

కానీ నిత్య వాద‌న మాత్రం ఇంకోలా ఉంది. ”త్రివిక్ర‌మ్‌, గుణ‌శేఖ‌ర్‌లాంటి ద‌ర్శ‌కులు అడిగితే `నో` చెప్ప‌డానికి పెద్ద‌గా కార‌ణాలు వెదుక్కోవాల్సిన అవ‌సరం క‌నిపించ‌లేదు. నేనెప్పుడూ ఓ క‌థానాయిక‌గా ఫీల్ అవ్వ‌ను. న‌న్నో న‌టిగా గుర్తించి అవ‌కాశం ఇస్తే… వ‌దులుకోవాల‌నిపించ‌దు” అని చెబుతోంది. జ‌న‌తా గ్యారేజ్ ఒప్పుకోవ‌డానికి కూడా ఓ రీజ‌న్ ఉంద‌ట‌. ఓ స్టార్ హీరో చేసే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో భాగం కావాల‌నుకొంద‌ట‌. అందుకే.. జ‌న‌తాలో క‌నిపించింద‌ట‌. ఇలాంటి కార‌ణాలు ఎన్న‌యినా చెప్పుకోవొచ్చు. చేసిన త‌ప్పుల్ని స‌రిపెట్టుకోవొచ్చు. కానీ నిత్య ఇమేజ్ రూపం మాత్రం మెల్లిమెల్లిగా మారిపోతోంది. నిత్య సినిమా అంటే అది రొటీన్ సినిమా కూడా కావొచ్చ‌న్న అభిప్రాయానికి వ‌చ్చేసే అవ‌కాశం ఉంది. అప్పుడు నిత్య‌కీ మిగిలిన సో కాల్డ్ హీరోయిన్ల‌కూ పెద్ద తేడా ఉండ‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com